తూర్పు లడాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

by  |
Indian Army
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు లడాఖ్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తతమయ్యాయి. ప్యాంగాంగ్ సో దక్షిణ తీరంలో చైనా కవ్వింపులకు దిగుతున్నదని, ముందస్తు సమాచారం మేరకు భారీగా బలగాలను మోహరించి డ్రాగన్ యథాతథ స్థితిని ఉల్లంఘించకుండా అడ్డుకున్నామని సోమవారం భారత ఆర్మీ ప్రకటించగానే లడాఖ్‌లో పరిస్థితులు వేగంగా మారాయి. తమ ఆర్మీ సరిహద్దును దాటలేదని వెంటనే చైనా ఉద్ఘాటించింది.

కాగా, మంగళవారం చైనా తన స్వరాన్ని పెంచుతూ భారత సైన్యమే ఇరుదేశాల మధ్య కుదిరిన అంగీకారాన్ని ఉల్లంఘించిందని, సరిహద్దును చట్టవ్యతిరేకంగా దాటిందని ఆరోపించింది. దీంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా ఉద్రిక్తతలను తొలగించడానికి ఇరుదేశాల బ్రిగేడ్ స్థాయి మిలిటరీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

సోమవారం భారత వైపున చుషుల్‌లో శాంతి చర్చలు జరగ్గా, మంగళవారం చైనా వైపునా మోల్డోలో జరుగుతున్నాయి. రెండో రోజు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ బలగాల మోహరింపు మాత్రం భారీగా పెరుగుతూనే ఉన్నది. చుషుల్ ఏరియాకు సమీపంలో ‘కాలా టాప్’ అనే కొండపర్వతం దగ్గర ఇరుదేశాల యుద్ధ ట్యాంకులు దాదాపు ఫైరింగ్ రేంజ్‌లోనే ఎదురెదురుగా వచ్చిచేరినట్టు తెలుస్తున్నది.

ఈ ప్రాంతానికి ఇరుదేశాలు బలగాలు, ఆయుధ సామగ్రిని తరలించినట్టు కొన్నివర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, నిఘా వర్గాల సమాచారంతో చైనాను అడ్డుకోవడానికి భారత ఆర్మీ ఎల్ఏసీకి సమీపంలో మోహరించిన ఎత్తైన కొండలు ఎల్ఏసీకి తమవైపున ఉన్నాయని డ్రాగన్ కంట్రీ వాదిస్తున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

తూర్పు లడాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు సమసేందుకు మే నెల ఇరుదేశాలు మిలిటరీ, దౌత్యస్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయి. జూన్ హింసాత్మక ఘర్షణలతో ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. అప్పటి నుంచీ పలుదఫాలుగా చర్చలు జరిగాయి. బలగాల ఉపసంహరణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ఒప్పందాలను ఆగస్టు 29/30 రాత్రి చైనా పీఎల్ఏ ఉల్లంఘించిందని, యథాతథ స్థితిని మార్చడానికి పలుయత్నాలు చేసిందని భారత ఆర్మీ సోమవారం ప్రకటించింది.

భారత ఆర్మీ చైనా దుస్సాహసాన్ని అడ్డుకోగలిగిందని తెలిపింది. చర్చల ద్వారా శాంతియుత వాతావరణానికి సైన్యం కట్టుబడి ఉన్నదని, అలాగే, భారత భూభాగాలను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నదని పేర్కొంది. గతంలో వివాదాస్పద స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా తాజా ఉద్రిక్తతలు కొత్తస్పాట్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో లడాఖ్‌లో మొత్తం సరిహద్దులో సైనికుల కదలికలు కనిపిస్తున్నాయి.

ఆగస్టు 31న భారత సైన్యమే ఒప్పందాలను ఉల్లంఘించి అక్రమంగా ఎల్ఏసీ హద్దును దాటిందని చైనా ఎంబసీ ప్రతినిధి జి రోంగ్ మంగళవారం అన్నారు. ప్యాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరం దగ్గర, రెఖిన్ పాస్ దగ్గర ఎల్ఏసీని దాటి తమ భూభాగంలోకి దూసుకొచ్చిందని ఆరోపించారు. భారత చర్య చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని, చైనా దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.

భారత్ తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని, ఇరుదేశాల మధ్య ఒప్పందాలను గౌరవించాలని పేర్కొన్నారు. చట్టవ్యతిరేకంగా ఎల్ఏసీ దాటుతున్న ట్రూపులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. టిబెట్‌‌పై ఉన్నతాధికారుల సమావేశంలో సరిహద్దును కాపాడటమే ప్రధానమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శనివారం వ్యాఖ్యానించడం గమనార్హం.


Next Story

Most Viewed