ప్లీనరీ నుంచి హుజురాబాద్‌ ఓటర్లకు కేసీఆర్ కీలక సందేశం

by Anukaran |   ( Updated:2021-10-25 02:11:47.0  )
Chief Minister KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, ఓటర్లపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు ఈసీకి లేఖ రాసి పథకాన్ని నిలిపివేయించారని మండి పడ్డారు. ఈసీకి ఇది ఏమాత్రం గౌరవం కాదని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. సోమవారం మాదాపూర్‌లోని ప్లీనరీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సభ పెట్టనివ్వకుండా ఈసీ ఆపింది. నేను ఇక్కడ నుంచి హుజురాబాద్ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. నవంబర్ 4 నుంచి హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ అమలు చేస్తాం. ఈసీ వచ్చే నెల 4వ తేదీ వరకే ఆపగలదు.

హుజురాబాద్ ప్రజలంతా కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తారని తెలుసు. గెల్లు శ్రీనివాస్ స్వయంగా నవంబర్ 4 నుంచి ప్రతి ఒక్కరికీ పథకం అమలు అయ్యేలా దగ్గరుండి చూసుకుంటాడు. ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నవంబర్, డిసెంబర్ నెలల్లోగా అర్హులైనా అందరికీ ‘దళితబంధు’ ఇస్తాం. మార్చి వరకు పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించిన నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేస్తాం. అనంతరం రాష్ట్రమంతా అమలు చేసేందుకు కార్యచరణ సిద్ధం అవుతోంది. దీనికోసం 118 నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు, దళిత బంధు సమితి సభ్యులు హుజురాబాద్ వచ్చి అమలు ఎలా జరిగిందో చూస్తారు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed