వైసీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. ఓటేసిన ప్రజలకు అలా

by srinivas |   ( Updated:2021-08-13 04:09:02.0  )
anandayya mandu
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్‌తో ప్రపంచం విలవిలలాడిపోయింది. ముఖ్యంగా మహమ్మారి దెబ్బకు ఏపీ ప్రజలు వణికిపోయారు. కరోనా సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మరువకముందే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ వార్తలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతుంది. ఇదే తరుణంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ వేవ్‌ విజృంభణ సమయంలో ఆనందయ్య మందును సొంత ఖర్చుతో పెద్ద ఎత్తును పంపిణీ చేసిన ఆయన థర్డ్‌వేవ్ నుంచి తన నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని తెలియజేశారు.

థర్డ్ వేవ్ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయం కేంద్రంగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1.60 కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు. గడిచిన కరోనా వేవ్ పరిస్థితుల కన్నా అత్యంత ప్రమాదకరంగా థర్డ్ వేవ్ ముంచుకొస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిరంతరంగా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

కరోనా నిబంధనలు తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా చంద్రగిరి ప్రజల అవసరాల కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. గతంలో కూడా కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచామని అందుకు మాస్క్‌లు, శానిటైజర్లు, పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లు, నిత్యావసర సరుకులు, విటమిన్ టాబ్లెట్‌లు, సిరప్‌లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రజల కోసం తన వంతు బాధ్యతగా ఎంత కష్టమైనా..ఎంత ఖర్చుకైనా వెనకాడబోనని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed