జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన చంద్రబాబు

by Anukaran |   ( Updated:2021-08-02 11:58:21.0  )
జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందని అన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై ఈ నెల 7న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణాలని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎక్కడా తట్ట మట్టి పోయలేదని.. రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్యకిందకు వస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని.. దళిత హోంమంత్రిని డమ్మీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీఎస్‌డీసీ ద్వారా అప్పులు తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్రం లేఖ రాయడం జగన్ రెడ్డి తీరుకు నిదర్శనమన్నారు. మున్సిపల్ ఉద్యోగులు జీతాలు అడిగితే అరెస్ట్ చేసే దుస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించడం పట్ల మండిపడ్డారు. ఉద్యోగులకు అండగా ఉండాలని టీడీపీ నేతలు నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. సొంతబాబాయి వివేకానందరెడ్డి కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డా.సునీతారెడ్డి ఇచ్చిన జాబితాలోని ఇంటి వారిని ఇంకా ఎందుకు విచారించలేదని సీబీఐని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరిగిందని ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed