గోవాపై చెన్నయిన్ గెలుపు

by Shyam |
గోవాపై చెన్నయిన్ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ 2-1 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గోవా జట్టు కుడి నుంచి ఎడమకు ఆడాలని నిర్ణయించుకుంది. ఆట తొలి నిమిషం నుంచే ఇరు జట్లు గోల్ పోస్టులపై దాడులకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో 5వ నిమిషంలోనే చెన్నయిన్ ఎఫ్‌సీ ఆటగాడు రఫేల్ క్రివెలారో గోల్ చేశాడు. కార్నర్ నుంచి అతడు కొట్టిన బంతి నేరుగా గోల్‌పోస్టులోకి వెళ్లింది. దీంతో చెన్నయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మరో నాలుగు నిమిషాల్లోనే ఎఫ్‌సీ గోవా గోల్స్ సమం చేసింది.

9వ నిమిషంలో గోవా ఆటగాడు అలెగ్జాండర్ జేసురాజ్ అందించిన పాస్‌ను ఎటువంటి తప్పు చేయకుండా జార్జ్ మెండోజా గోల్ కొట్టాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఇరు జట్లు తొలి అర్ద భాగంలో మరో గోల్ చేయలేకపోయాయి. రెండో అర్దభాగం 52వ నిమిషంలో గోవాకు గోల్ చేసే అవకాశం వచ్చినా స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. 53 నిమిషంలో రఫెల్ క్రివెలారో ఇచ్చిన పాస్‌ను రహీమ్ అలీ గోల్‌గా మలచడంతో చెన్నయిన్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గోవా జట్టు పలు మార్లు ప్రత్యర్థి గోల్‌పోస్టుపై దాడి చేసినా లక్ష్యం చేరుకోలేదు. బంతి కూడా ఎక్కవ సమయం గోవా నియంత్రణలోనే ఉన్నది. అక్యురేట్ పాస్‌లు ఇచ్చినా స్ట్రైకర్లు గోల్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో చెన్నయిన్ ఎఫ్‌సీ 2-1 గోల్స్ తేడాతో గోవాపై విజయం సాధించింది. మొత్తం 11 పాయింట్లతో ఏకంగా 8వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకున్నది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రెండూ కూడా రఫేల్ క్రివెలారోకు దక్కింది.

Advertisement

Next Story