పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఏపీకి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం

by srinivas |
Hardeep Singapore
X

దిశ, ఏపీ బ్యూరో: పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి మెలిక పెట్టింది. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సర్దుబాటు చేస్తేనే పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. వీజీఎఫ్‌ సర్ధుబాటుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమవుతుందని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌‌పూరి స్పష్టం చేశారు.

రాజ్యసభలో సోమవారం వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కాకినాడలో రూ.32,901 కోట్ల వ్యయంతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఏపీ ప్రభుత్వం గెయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న విషయాన్ని వెల్లడించారు. తదనంతరం ప్రాజెక్ట్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చాలంటే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాలని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి.

అనంతరం వీజీఎఫ్‌ను సమకూర్చవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు భారీ మూలధన వ్యయం, పెట్టుబడుల అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పారిశ్రామీకరణ తో పాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో రాబడి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందువలన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మంత్రి హర్దీప్‌ సింగ్‌‌పూరి తన జవాబులో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed