- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కన్నెర్ర
దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కన్నెర్ర చేసింది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశంలో ప్రశ్నల వర్షం కురిపించింది. కనీస అనమతులు, సమాచారం లేకుండా ప్రాజెక్టులు కడుతారా అంటూ నిలదీసింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ నేరుగా రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖ పంపించారు. ప్రాజెక్టులపై ఘాటు వ్యాఖ్యలతో ఈ లేఖలు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశాలకు కూడా రాకుండా తప్పించుకుంటున్నారని, రెండేళ్లత నుంచి అపెక్స్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి నేరుగా సీఎంలకు రాసిన ఈ లేఖ ఇరు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. రెండురాష్ట్రాలు రెండు నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను ఇవ్వాలని, కనీసం బోర్డులకు కూడా సమాచారమివ్వరా అంటూ ప్రశ్నించారు.
రాయలసీమను వెంటనే ఆపండి
ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం దగ్గర నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమకు ఎలా టెండర్లు పిలుస్తారని ప్రశ్నించింది. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు అనుబంధ పనులపై ఏపీ టెండర్లకు పిలువడం కరెక్ట్ కాదని, ఇది కొత్తప్రాజెక్టు అని, దీనికి సంబంధించిన డీపీఆర్‌లను వెంటనే సమర్పించాలని, జూన్ 4న నిర్వహించిన కేఆర్ఎంబీ సమావేశంలో వారంరోజుల్లో డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించినా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తాను కూడా బోర్డులకు ఆదేశాలిచ్చానని, డీపీఆర్‌లు ఇవ్వకుండా, అనుమతులు లేకుండా రాయలసీమపై ముందుకు పోరాదని చెప్పానని, కానీ వీటన్నింటినీ పట్టించుకోకుండా ఎలా టెండర్లు పిలుస్తారని ఏపీని ప్రశ్నించారు. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులను ఎక్కడికక్కడే ఆపాలని లేఖలో సూచించారు.
8 ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వండి
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేవలం రెండు టీఎంసీలకు మాత్రమే పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకున్నారని, మిగిలిన ప్రాజెక్టులకు ఎందుకు అనుమతులు తీసుకోవడం లేదని లేఖలో ప్రశ్నించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారని, కనీసం ఈ సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. అదే విధంగా గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ -3, సీతారామ, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై, లోయర్ పెనుగంగ బరాజ్‌లు, రామప్ప టూ పాకాల డైవర్సన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు తేలిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని లేఖలో వివరించారు.
మూడో టీఎంసీ పనులు ఆపండి
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా రెండు టీఎంసీలకు అడ్వయిజరీ బోర్డు అనుమతి తీసుకున్నారని, కానీ మూడో టీఎంసీ పనులకు అనుమతులు లేవని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ముందుగా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులను నిలిపివేయాలని లేఖలో హెచ్చరించింది. రెండు నదుల యాజమాన్య బోర్డులు నిర్వహించిన సమావేశాల సందర్భంగా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని సూచించినా ఎందుకు పట్టించుకోవడం లేదని, డీపీఆర్‌లు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రం ప్రశ్నించింది.
చట్టాల ఉల్లంఘనే
ఏపీ విభజన చట్టం ప్రకారం నీళ్ల అంశంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు. ‘8 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదని, ఇది చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం ఉల్లంఘించనట్లుగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. రెండు నదులపై రెండు రాష్ట్రాలు ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకు సాగినా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, వాటి వివరాలన్నీ కౌన్సిల్ ముందు ఉంచాలని వివరించారు. అదేవిధంగా నదీ యాజమాన్య బోర్డుల అనుమతి కూడా తప్పనిసరి అని, ప్రాజెక్టుల నిర్మాణాలు, అందుకు కారణాలను బోర్డులకు తప్పకుండా చెప్పాలని, కానీ రెండు రాష్ట్రాలు కూడా నిబంధనలు పాటించలేదని లేఖలో తేల్చి చెప్పింది. అసలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఎందుకు దాచి పెడుతున్నారని, వివరాలు రహస్యంగా ఎందుకు పెడుతున్నారని లేఖలో ప్రస్తావించారు.
అపెక్స్ రావడం లేదు
రాష్ట్ర విభజన తర్వాత కేవలం ఒకేసారి సెప్టెంబర్ 2016లో అపెక్స్ కౌన్సిల్ నిర్వహించారని, ఆ తర్వాత నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్రాల నుంచి సమయం కేటాయిస్తూ సమాధానం రాలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 5న అపెక్స్ కౌన్సిల్‌కు పిలిచామని, అంతకు ముందే ఎజెండా అంశాలను పంపించామని, డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు జూన్‌లో 4, 5తేదీల్లో జరిగిన కేఆర్ఎంబీ, జీఎఆర్ఎంబీ సమావేశాల్లో కూడా డీపీఆర్‌లు ఇవ్వాలని గడువు పెట్టినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 2019లోనే జలశక్తి శాఖ ఉన్నతాధికారులు రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేసి ఎజెండా కోరినా ఇవ్వలేదని లేఖలో గుర్తుచేశారు. మే నెలాఖరు వరకు ఎజెండా అంశాలు, డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించామని, కానీ రెండు రాష్ట్రాలు తేలికగా తీసుకున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సమయం ఇవ్వడం లేదని, ఎజెండా అంశాలపై సమాధానం లేదని లేఖలో మండిపడ్డారు. ఈ నెల 5న అపెక్స్ నిర్వహించాల్సి ఉండగా ఇరు రాష్ట్రాల సీఎంలు వాయిదా వేయాలనికోరారని, ఈ నెల 20 తర్వాత నిర్వహించేందుకుచర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి షెకావత్ లేఖలో వెల్లడించారు.
ఏపీ కూడా అంతే
తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లేఖ రాశారు. కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పనులు తాజాగా ఎలా చేస్తారని, టెండర్ల ప్రక్రియను ఎలా చేపట్టారని, ఎక్కడెక్కడైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కనీసం బోర్డుకు కూడా వివరాలివ్వలేదని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కేంద్రం నుంచి ఈ లేఖలు రాశారు.