రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు

by Shamantha N |
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు
X

న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో, పర్యాటక ప్రాంతాలు, మార్కెట్‌లలో పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడటం, మాస్క్ లేకుండా తారసపడటంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, హిల్ స్టేషన్‌లలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఒకరి నుంచి వైరస్ వ్యాప్తి చెందే వేగాన్ని తెలిపే ఆర్(రీప్రొడక్షన్) ఫ్యాక్టర్ సంఖ్య పెరగడంపైనా ఆందోళన చెందింది. ఆర్ ఫ్యాక్టర్ 1 కన్నా పెరిగిందంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టే లెక్క అని హెచ్చరించింది. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్టు అర్థం చేసుకోవాలి.

ఇది పెరిగిందంటే వైరస్ ఒకరి నుంచి ఒకరికి మించి ఎక్కువ మందికి సోకుతున్నట్టే. అందుకే బహిరంగ ప్రాంతాల్లో గుమిగూడటంపై కేంద్రం హెచ్చరిస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవలే హెచ్చరించిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని, కొవిడ్ ప్రొటోకాల్ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. టీకా పంపిణీ వీలైనంత వేగంగా చేపడుతున్నప్పటికీ ముందుజాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని సూచించారు. కొవిడ్ ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని తెలిపారు. కరోనా నియంత్రణలో ఐదు అంశాలను తప్పకుండా అమలు చేయాలని టెస్టు, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనల పాలన అనే ఐదు సూత్రాలను నిర్లక్ష్యం వహించకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడం సంబంధిత అధికారుల బాధ్యత అని, నిబంధనల ఉల్లంఘనలు కనిపిస్తే ఆయా చోట్లా మళ్లీ ఆంక్షలు విధించాలని ఆదేశించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన వారిపైనా సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది సంబంధి అధికారుల బాధ్యతేనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed