కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్!

by Shamantha N |
కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్!
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. హాట్‌స్పాట్‌లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేసి కరోనాకు కళ్లెం వేసేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 170 హట్‌స్పాట్ జిల్లాలను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ హాట్‌స్పాట్‌లలో హైదరాబాద్ కూడా ఉన్నది. దీంతో తెలంగాణ రాజధానిలో కఠిన ఆంక్షలు కాబోతున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. తెలంగాణలో 647 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో సింహభాగం హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో 213 కరోనా కేసులు వెలుగుచూసినట్టు కేంద్రం పేర్కొంది.

170 హాట్‌స్పాట్ జిల్లాలు సహా హాట్‌స్పాట్‌లుగా మారే జిల్లాలు 207 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ హాట్‌స్పాట్ జిల్లాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌లలో అత్యవసర సేవల కోసం తప్పితే ప్రజలను బయటకు రానివ్వబోరని చెప్పారు. ఈ జోన్‌లలో కరోనా నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ బృందాలు కరోనా పేషెంట్‌ల కాంటాక్టులను జల్లెడ వేస్తాయని, ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాయని అన్నారు.

రెడ్‌ జోన్‌లు, వైట్ జోన్‌లు, గ్రీన్ జోన్‌లు :

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్‌-హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. వీటినే రెడ్‌ జోన్‌లు, వైట్ జోన్‌లుగా పరిగణించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఏ కేసు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా గుర్తిస్తారు. అంటే 353 జిల్లాలు గ్రీన్ జోన్ కేటగిరీలో చేరుతున్నాయి. ప్రధాని మోడీ పేర్కొన్నట్టు ఈ 353 జిల్లాల్లో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ పాక్షికంగా సడలించబోతారని తెలుస్తున్నది. అయితే, ఏప్రిల్ 20వరకు కొత్తగా కేసులు నమోదుకాకుంటేనే ఈ అవకాశముంటుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా, స్వల్ప సంఖ్యలో నమోదైతే వాటిని నాన్-హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తారు.

ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరులు కూడా..

రెడ్ జోన్‌లలో పలు ప్రధాన నగరాలున్నాయి. కేంద్రం గుర్తించిన 170 హాట్‌స్పాట్‌లలో హైదరాబాద్ కూడా ఉన్నది. తెలంగాణ రాజధానితోపాటు.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, ఛండీగడ్, శ్రీనగర్, పూణె, నాగ్‌పూర్, ఇండోర్ సహా పలు నగరాలున్నాయి. కాగా, గ్వాలియర్, కాంచిపురం, పుదుచ్చేరి, బరేలీ, వారణాసి, హరిద్వార్, కాలింపోంగ్ జిల్లాలు వైట్ జోన్ కేటగిరీలోకి చేరాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతాలు.. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్ష దీవులు, రాష్ట్రాలు.. మణిపూర్, సిక్కింలలో ఒక్క రెడ్ జోన్‌ కూడా లేకపోవడం గమనార్హం.

హాట్‌స్పాట్‌లను ఎలా గుర్తిస్తారు?

ప్రతివారం దేశవ్యాప్త జిల్లాలను కరోనా కేసుల సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమం(ఎక్కువ కేసులున్న జిల్లాల నుంచి తక్కువ ఉన్న జిల్లాలుగా లిస్ట్‌ఔట్ చేస్తారు)లో జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో దేశంలోని 80శాతం కేసులను కాంట్రిబ్యూట్ చేస్తున్నజిల్లాలను రెడ్ జోన్‌లుగా గుర్తిస్తారు. ఏ కేసూ లేని జిల్లాలను గ్రీన్ జిల్లాలు.. మధ్యలోని జిల్లాలను వైట్ జోన్‌లుగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే, రాష్ట్రస్థాయిలోనూ ఇటువంటి జాబితా రూపొందించి రెడ్ జోన్‌లను గుర్తిస్తారు. దీంతోపాటు నాలుగు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్న జిల్లాలనూ హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తారు. కేసుల సంఖ్యను బట్టి గ్రీన్ జోన్ జిల్లాలు.. రెడ్ జోన్‌కు, రెడ్ జోన్ జిల్లాలు.. గ్రీన్ జిల్లాలకు మారొచ్చు. 28 రోజుల వరకు ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాకుంటే రెడ్ జోన్ జిల్లాను కూడా గ్రీన్ జోన్ జిల్లాగా పరిగణిస్తారు.

హాట్‌స్పాట్‌లలోనూ మళ్లీ విభజన..

ఆర్థిక కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో.. రెడ్ జోన్‌గా గుర్తించిన జిల్లా మొత్తాన్ని దిగ్బంధించబోరు. హాట్‌స్పాట్ జిల్లానూ లార్జ్ ఔట్ బ్రేక్(కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్న ఏరియా), క్లస్టర్‌లుగా విభజిస్తారు. ఈ రెండు ఏరియాల్లో కఠిన ఆంక్షలు అమలవుతాయి. అంటే హాట్‌స్పాట్‌గా గుర్తించిన జిల్లాలో లార్జ్ ఔట్ బ్రేక్, క్లస్టర్‌లలో పటిష్ట నిబంధనలు అమలుచేస్తారు. అలాగే, హాట్‌స్పాట్ బయట కొద్ది పరిధి మేరకు బఫర్ జోన్ ఉంటుంది.

Tags: hotspots, non hotspots, districts, classified, hyderabad, health ministry, red zone

Advertisement

Next Story

Most Viewed