ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) త్వరలోనే ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌-2020ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐకి అనుమతులు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 19 నుంచి బీసీసీఐ నిర్వహించతలపెట్టిన ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. దీంతో వచ్చే 19న ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఫైనల్స్ నవంబర్ 10న జరగనున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ రద్దు కావడంతో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొవిడ్-19 కారణంగా ఇండియాలో నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఈ ఏడాది విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావించింది. యూఏఈ, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజీలాండ్ దేశాలు ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అయితే గతంలో నిర్వహించిన అనుభవంతోపాటు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న యూఏఈ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.

చైనా స్పాన్సర్లను కొనసాగించాలి: గవర్నింగ్ కౌన్సిల్

మరోవైపు ఆదివారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. చైనా స్పాన్సర్లను ఐపీఎల్‌తో కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాకుండా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదన మేరకు ఐపీఎల్ ఫైనల్స్ నవంబర్ 10న నిర్వహించడానికి ఒప్పుకుంది. కాగా, వారంలో ఐదు రోజులు మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి మ్యాచ్ 3.30 గంటలకు, రెండో మ్యాచ్ 7.30 గంటలకు జరగనుంది. అయితే, ప్రేక్షకులను అనుమతించే విషయంపై యూఏఈ ప్రభుత్వంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పారు.

Advertisement