రామయ్యా.. నీ పెళ్లికి రామయ్యా!

by Shyam |
రామయ్యా.. నీ పెళ్లికి రామయ్యా!
X

దిశ వెబ్ డెస్క్ :
రాములోరి కళ్యాణం అంటే.. తెలుగు లోగిళ్లలో పండుగ రోజే కదా! ఊరంతా కలిసి.. తెలుగు ప్రజలంతా ఒక్కటై.. అంగరంగా వైభవంగా.. అష్టదిక్కుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియగా.. ఆ సీతారాముల పెళ్లి … ఊరూరా కన్నుల పండుగగా జరిగేది కదా. అంతా రామమయం అయ్యేది. ఊరంతా చలువ పందిళ్లు.. రామయ్యా గుడి నిండా భక్తుల పరవళ్లు.. ఏ ఇంట చూసినా హడావిడి… ఏ నోట విన్నా.. రామనామ పదజడి. భద్రాచలం, ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణ తంతు చూడటానికి రెండు కన్నులు సరిపోవునా! అంటూ భక్తజనం ఆనందోత్సాహం వ్యక్తం చేసేవారు. అలాంటి శ్రీరామనవమి రోజు… కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా.. ఓ రామయ్యా… నీ కల్యాణానికి రాలేకపోతిమయ్యా… ఒకింత బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ, నీ నామాన్ని జపిస్తూ.. లోక కల్యాణాన్ని కాంక్షిస్తున్నామని తమ భక్తిని, నిస్సహాయ స్థితిని చెప్పుకుంటున్నారు భక్తులు.

రాముని కల్యాణం ఘట్టాన్ని వీక్షించడం.. భక్తులకు నయనానందకరం.. జన్మసార్థకం. ప్రతి ఏటా… ఆ రాముని కల్యాణాన్ని అంగంరంగా వైభవంగా జరుపుకునే పల్లెలన్నీ నేడు… గడప దాటట్లేవు. ఒంటిమిట్ట , భద్రాచలానికి పరుగుపరుగున బయలుదేరే భక్తజనులంతా… కాళ్లు కదపడం లేదు. కరోనా తమను కమ్మేసిందని… మహమ్మారి తమను ఇల్లు దాటనీయడం లేదని .. రామయ్య కల్యాణ సుముహూర్తమే… ఆ వైరస్ పాలిట దుర్ముహూర్తం అవుతుందని తెలుగు ప్రజలంతా ఆశిస్తున్నారు. తమ నిస్సహాయ స్థితిని మన్నించమంటూ మనసులోనే రామయ్యకు విన్నవించుకుంటున్నారు. కల్యాణానికి.. రావాలని ఉన్నా.. కరోనా కట్టిపడేయడంతో .. రాలేకపోతున్న భక్త జనులంతా ఈ విపత్కర పరిస్థితులు త్వరలో పోతాయని.. రాబోయే కాలంలో లోకకల్యాణం జరగుతుందని ఆశిస్తున్నారు. చెడుపై.. మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. మనం అనుకుంటే.. మన మనసే మందిరం చేసుకుని… మన ఇంటినే దేవాలయంగా భావించి.. సీతారాముల కల్యాణం చేయడం ఉత్తమమని భక్తజనం భావిస్తున్నారు. మన ఊపిరే పల్లకి, మన మనసే మండపం, చిత్తశుద్దే.. చిగురుపచ్చ తోరణాలు, తన్మయత్మమే .. తలంబ్రాలు, రామ జపమే.. వేదమంత్రోచ్ఛరణలు, గుండెసవ్వడే మంగళ వాయిద్యాలు.. సీతారాముల కల్యాణం ఎలా చేసినా.. అది కడు రమణీయమే. ఈ శ్రీరామ నవమి నాడు ప్రతి హృదయం… ఓ మిథిలా మండపమేననే భక్తులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది అయినా రాములోరి కమనీయ కల్యాణాన్ని కనులారా వీక్షిస్తామనే నమ్మకంతో ఇంటిపట్టునే ఉండిపోతున్నారు.

Tags: sri rama navami, vada pappu, lock down, corona, tv, live, bhadrachalam, vontimitta

Advertisement

Next Story

Most Viewed