పలు కేసుల్లో అత్యంత కీలకం ఇవే!

by Anukaran |   ( Updated:2020-07-17 20:44:16.0  )
పలు కేసుల్లో అత్యంత కీలకం ఇవే!
X

దిశ, హుస్నాబాద్: నియోజకవర్గంలో కేసుల విషయంలో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయి. నేరస్తులను పట్టిస్తూ కటకటాలపాలు చేస్తున్నాయి. ఇటీవలే హుస్నాబాద్ పట్టణంలో సీసీ కెమెరాల సహాయంతో బాలుడు కిడ్నాప్ కేసును సాల్వ్ చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. అక్కన్నపేట, కోహెడ మండలాల్లోనూ వీటి సహాయంతో పోలీసులు పలు కేసులను ఛేదించారు. గతేడాది జనవరి 4న మడద గ్రామపరిధిలోని బంటుపల్లి గ్రామానికి చెందిన పోలోజు నాగరాజు అనే యువకుడు హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పరిధిలోని బల్లునాయక్ తండాకు గ్రామానికి చెందిన నలుగురు యువకులు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండల పరిధిలోని గొర్ల దొంగతనాలకు పాల్పడగా వారిని పట్టించడంలో సీసీ కెమెరాలు కీలక‌పాత్ర పోషించాయి. అక్కన్నపేట మండలం మసిరెడ్డి తండాకు చెందిన మాలోతు రవికి సంబంధించిన జేసీబీ నుంచి 100 లీటర్ల డీజీల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలిస్తుండగా సీసీ కెమెరాల చిక్కారు. సైదాపూర్ మండలానికి చెందిన కుమార్, సునీల్ దొంగిలించారని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని నేరాలను నియంత్రించడం కోసం పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యత వాటి వల్ల ఉపయోగాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని 6 మండలాల్లోని 128 గ్రామపంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్‌లో బ్రహ్మోత్సవాలు, కోహెడ మండల పరిధిలోని సింగరాయ జాతర, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మహాశివరాత్రి ఉత్సవాలు, గత ఎడాది జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచుతూనే, గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. దుకాణాల్లో సైతం యజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

తగ్గిన క్రైమ్ రేటు

మూడేండ్లలో డివిజన్ పరిధిలో ఉన్న 6 మండలాల్లో క్రైమ్ రేటు పడిపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో కనువిప్పు, ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థే. ఇందులో గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలను చైతన్యవంతం చేస్తూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న, దొంగతనాలకు పాల్పడిన వెంటనే పోలీసు యంత్రాంగం క్షణాల్లో తెలుసుకునేందుకు గ్రామాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడమే కాకుండా త్వరితగతిన ఘటనా స్థలానికి చేరుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గ్రామ కూడళ్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే చేస్తూ పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిక్షణ పొందిన పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల పరిధిలో 95 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హుస్నాబాద్ మండలంలో 100 సీసీ కెమెరాలు, అక్కన్నపేటలో 126, కోహెడలో 133, చేర్యాల మండలంలో 102, కొమురవెల్లి 120, మద్దూర్ 130 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అక్కన్నపేటలోని 9 గ్రామాలు, కొహెడ మండలంలోని 3 గ్రామాల్లో త్వరలోనే కెమెరాల ఏర్పాటును పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

24 గంటలు పనిచేస్తున్నాయి: మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ

శాంతి భద్రతలను పరిరక్షించేందుకు స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్, వర్తక వ్యాపార సంస్థల్లో, గ్రామ, మండల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ‌లు 24 గంటలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అంతర్ రాష్ట్ర ముఠాలతో పాటు వాహనచోదకులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే ముఖచిత్రాలతో పాటు వాహన నెంబర్ ప్లేట్లను పరిశీలించే ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. కోర్టులో నేరస్తులు చేసిన నేరం రుజువు కావడానికి సీసీ పూటేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

సెల్ ఫోన్‌కు అనుసంధానం: శివ, క్లాత్ షోరూం యజమాని

షాపు లావాదేవీల విషయంలో ఇబ్బందులు రావొద్దని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా. వీటిని సెల్ ఫోన్‌కు అనుసంధానం చేశా. దుకాణం నిత్యం కష్టమర్లతో రద్దీగా ఉంటుంది. మా షాపు డివిజన్ కేంద్రంలో ఉండడం ద్వారా ప్రతి రోజు అనేక మంది కస్టమర్లు వస్తుంటారు. వ్యాపార లావాదేవీలపై కస్టమర్లు ఇస్తున్నా డబ్బులు, వస్తువుల కొనుగోలు వంటి అంశాలపై నేను దుకాణంలో లేకున్నా సెల్ ఫోన్ లో చూస్తుంటాను.

Advertisement

Next Story

Most Viewed