అక్రమ నిర్బంధంపై సీబీఐ విచారణ

by srinivas |
అక్రమ నిర్బంధంపై సీబీఐ విచారణ
X

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని అక్రమంగా నిర్బంధించారా? లేదా? అన్న ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ వ్యవహార శైలిపై హైకోర్టు ప్రాధమిక విచారణ తరువాత సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి విచారణ ప్రారంభించారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారా కోడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులను క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో 2019 అక్టోబర్‌లో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ కేసులో అయినా అదుపులోకి తీసుకున్న 24 గంటలలోపు నిందితులను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వారి అరెస్టును చూపించలేదు. దీంతో నిందితులు డబ్బు కోసం పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించి, విచారణ పేరిట రోజుల తరబడి వేధించారని హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో హైకోర్టు ప్రాధమిక విచారణకు ఆదేశించింది. అందులో అక్రమ నిర్బంధం నిజమేనని తేలింది. నిందితుడు ఐపీఎస్ అధికారి కావడంతో పిటిషనర్ల కోరిక మేరకు న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో గుంటూరు చేరుకున్న సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేశారు. నిందితులతో పాటు చేబ్రోలు పోలీసులను కూడా విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్పీ రామకృష్ణను కూడా వారు విచారించారు.

Tags: guntur, high court, ccs police, sp ramakrishna, cricket betting case, cbi investigation, chebrolu police station

Advertisement

Next Story

Most Viewed