పెన్సిల్‌పై16 మంది జాతీయ నటుల పేర్లు

by Shyam |   ( Updated:2021-06-21 03:03:50.0  )
Pencil-lead
X

దిశ, ఫీచర్స్ : కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైనవారికి ఏం చేయాలో తోచక కాలయాపన చేస్తుంటే.. మరికొంతమంది తాము మరిచిపోయిన కలలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ క్రమంలోనే కేరళ, అలూవాకు చెందిన ఆర్ట్ టీచర్ రాజేష్ పాండమిక్‌లో పెన్సిల్ మొనపై పేర్లు, వివిధ ఆకృతులను చెక్కుతూ ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదు అవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో చెక్కి రికార్డ్ క్రియేట్ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.

‘పెన్సిల్ శిల్పం కళాకారుడి పట్టుదలను పరీక్షించడమే కాదు అది సవాల్ లాంటిది. గ్రాఫైట్ ఒక ఆసక్తికరమైన పదార్థం. ఇది చాలా పెళుసుగా ఉంటుంది. ప్రతిసారీ శిల్పకళను పూర్తి చేయగలనా లేదా అని ఎప్పుడూ నన్ను నేను పరీక్షించుకుంటాను’ అని పెన్సిల్‌పై సూక్ష్మ శిల్పాలను సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ శిల్పి సాలవత్ ఫిడాయ్ అంటాడు. రాజేష్ కూడా ఆ మాటలతో ఏకీభవిస్తాడు.

Carving-records-on-pencil-l

లాక్‌డౌన్ వల్ల ఖాళీ సమయం రావడంతో పెన్సిల్ లెడ్ ఆర్ట్‌పై దృష్టి సారించిన రాజేష్, ప్రపంచ రికార్డులు సృష్టించిన వారి నుంచి ప్రేరణ పొందాడు. పెన్సిల్ గ్రాఫైట్‌పై తొలి పేరును చెక్కడానికి దాదాపు 55 సార్లు ప్రయత్నించాడు. ప్రతి సారీ విఫలమైన చివరకు పట్టుదలతో సాధించాడు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తాకిన సమయానికి రాజేష్ ‘నేమ్ కార్వింగ్’‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. 16 వేర్వేరు పెన్సిల్ లెడ్లలో, ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న 16 మలయాళ నటుల పేర్లను చెక్కి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. ప్రస్తుతం వాటిని అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) కు సమర్పించాలని కోరుకుంటాడు. రాజేష్ పెన్సిల్ ఆర్ట్‌తో పాటు, ఉడ్ కార్వింగ్, బాటిల్ ఆర్ట్, బ్యాంబూ పెయింటింగ్ వంటి వాటిల్లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు.

‘గ్రాఫైట్ సున్నితమైన మాధ్యమం. దానిపై చెక్కడానికి ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. శిల్పం పూర్తి చేసేంతవరకు పసిపాపను చూసుకుంటున్నట్లు దాన్ని చూసుకోవాలి’ అని రాజేష్ చెబుతున్నాడు.

Advertisement

Next Story