నెలల తరబడి లాక్‌డౌన్ సురక్షితం కాదు: ఫిక్కీ

by Harish |
నెలల తరబడి లాక్‌డౌన్ సురక్షితం కాదు: ఫిక్కీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాల పరిశ్రమలు మూతబడ్డాయి. అయితే, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఆర్థిక నష్టం భారీగా ఉంటుందని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించడానికి వ్యాపారం పునఃప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, లేదంటే అనేక సంస్థలు శాస్వతంగా మూతపడే పరిస్థితి రావొచ్చని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అభిప్రాయపడింది. అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తేయాలని, మొదటగా 22 నుంచి 39 ఏళ్ల మధ్య ఆరోగ్యంతో ఉన్న వారిని విధులకు హాజరయ్యేలా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని సూచించింది. వీటికి తోడు చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు తోడ్పాటును అందిస్తూ, కరోనా పరీక్షా కేంద్రాలను వీలైనంత ఎక్కువగా పెంచాల్సి అవసరముందని తెలిపింది.

పరిశ్రమలు లాక్‌డౌన్ ప్రభావం నుంచి బయటపడేందుకు అవసరమైన వ్యూహాలతో రూపొందించిన నివేదికలో ఫిక్కీ ఈ అంశాలను ప్రస్తావించింది. సంఘటిత రంగంలోని సంస్థలను, పరిశ్రమలను సగం సామర్థ్యంతో పనులకు అనుమతించి, వారం తర్వాత వారం ఉపాధి ఉండేలా కార్మికులకు పూర్తీ జీతం చెల్లించాలని పేర్కొంది. ఈ నెల చివరి వరకూ ప్రజా రవాణాను నిలిపివేయాలని, 50 శాతం సామర్థ్యాన్ని నడిపే పరిశ్రమల కోసం అవసరమైనన్ని బస్సులను మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇంకో రెండు వారాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని తెలిపింది. ఇదివరకే ఉన్న మాంద్యానికి తోడు, కరోనా మరింత దిగజార్చక ముందే తగిన నిర్ణయాలు తీసుకుని ఆర్థికవ్యవస్థను కాపాడుకోవాలని, కరోనా సంక్షోభంలో ఇండియా లాంటి దేశంలో నెలల తరబడి లాక్‌డౌన్‌ను కొనసాగించలేమని ఫిక్కీ అభిప్రాయపడింది.

Tags: coronavirus, economy, FICCI

Advertisement

Next Story

Most Viewed