స్టాఫ్​నర్సుల తుది జాబితాపై అభ్యర్థుల ఆందోళన

by Shyam |
staff nurse
X

దిశ,తెలంగాణ బ్యూరో: 2017 స్టాఫ్​నర్సుల తుది జాబితాలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు శుక్రవారం టీఎస్ పీఎస్సీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. టీఎస్ పీఎస్సీ గురువారం వెబ్​సైట్​లో పెట్టిన లిస్టులో అనర్హుల పేర్లున్నాయని నిరసన వ్యక్తం చేశారు. 2017లో ప్రభుత్వం 3,311 స్టాఫ్​నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​విడుదల చేసిందని,ఇందులో 3,172 అభ్యర్థుల సర్టిఫికేట్స్​వెరిఫికేషన్ మార్చి తొలి వారంలో పూర్తి అయిందన్నారు. అయితే తుది జాబితాలో 2,418 మంది అభ్యర్థుల పేర్లే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తుది జాబితా పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని,సర్టిఫికేషన్​పరిశీలన తర్వాత బీఎస్సీ నర్సింగ్​వారికి ఒక్క మార్కు తగ్గించారని అధికారులు చెబుతున్నారని, కానీ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించకుండానే తుది జాబితా ప్రకటించారన్నారు. రాష్ట్రంలో కరోన విపత్కర పరిస్థితుల్లో స్టాఫ్​నర్స్​ల అవసరమున్నా.. అర్హత లేదనే కారణంతో 893 పోస్టులను భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు.

తొలి విడత పూర్తైన తర్వాత రెండో విడత నియామక ప్రక్రియలోనూ అక్రమాలు జరిగినట్లు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అభ్యర్థుల ఆందోళనపై టీఎస్​పీఎస్సీ అధికారులు స్పందించారు. తాము ప్రకటించిన లిస్టుపై అనుమానాలున్న అభ్యర్థులు తమకు వినతి పత్రం అందించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed