పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారులకు పండుగే: సీఏఐటీ!

by Prasanna |
పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారులకు పండుగే: సీఏఐటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది దీపావళి పండుగ సీజన్ ముగిసిన తర్వాత ఈ నెలలో ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారాలు గణనీయంగా పెరుగుతాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) అభిప్రాయపడింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు దేశవ్యాప్తంగా 25 లక్షల వివాహాలు జరగనున్నట్టు సీఏఐటీ అంచనా వేసింది. వివాహానికి అవసరమైన కొనుగోళ్లు, సంబంధిత నిర్వహణల ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన వ్యాపారాలు జరుగుతాయని సీఏఐటీ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ సీజన్‌లో మొత్తం రూ.1.5 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయని, దీనివల్ల దాదాపు రూ.50,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ అంచనా వేసింది. ఈ ఏడాదిలో కరోనా పరిస్థితులతో పాటు తక్కువ వివాహ ముహుర్తాలు ఉండటంతో ఇప్పటివరకు వ్యాపారాలు మందకొడిగా జరిగాయి. ఇటీవలే పరిస్థితులు మెరుగవటం, ఈ నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో వ్యాపారులు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

దీపావళికి రికార్డు స్థాయిలో వ్యాపారాలు జరిగిన తర్వాత పెళ్లిళ్ల సీజన్‌లో సైతం అదే సెంటిమెంట్ కొనసాగుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ సీ భారతీయ అన్నారు. పెళ్లిళ్ల సీజన్ కోసం భారతీయ వినియోగదారులు ఇళ్ల మరమ్మతులు మొదలుకొని, ఇళ్లకు రంగులు వేయడం, దుస్తులు, ఆభరణాల కొనుగోళ్లు, ఎలక్ట్రానిక్స్, బహుమతులు, క్యాటరింగ్, ట్రావెల్, ఫొటోగ్రఫీ, ఆర్కెస్ట్రా వరకు అనేక వ్యాపారాల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సీఏఐటీ నివేదిక వివరించింది.

Advertisement

Next Story

Most Viewed