- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో మునుగోడుకు ఉపఎన్నిక.. అసెంబ్లీకి 4ఆర్‌లు?
దిశ, చౌటుప్పల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాక వరుసగా ఉప ఎన్నికల వేడి రాజుకుంది. దుబ్బాక, నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో ఉప ఎన్నికలు రాగా హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ జరిగిన ఉపఎన్నికలలో అధికార పార్టీ గెలుపు కోసం రూ. వందల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టడంతో ప్రజల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో మొదలైంది. దీంతో అప్పట్లోనే మునుగోడు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో దళిత బంధు అమలుతోపాటు రూ. 2 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయనని సవాల్ విసిరారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని బీజేపీ దేశంలో పుంజుకుంటుంది అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించాక బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కిన కోమటిరెడ్డి బీజేపీలో చేరుతారనే వార్తలు షికారు చేశాయి.
బలం చేకూరుస్తున్న 4ఆర్,5ఆర్ వ్యాఖ్యలు
హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించినంక బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫుల్ జోష్ లో ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ తో పాటు 4ఆర్, 5ఆర్ లు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు విచ్చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయం అనే అంచనాకు నియోజకవర్గ ప్రజలు వచ్చారు.
గెలుపు సాధ్యమేనా?
బీజేపీలో చేరనున్నట్లు గతంలో ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ నిర్ణయాన్ని కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటెల రాజేందర్ విజయంతో మళ్లీ ఒక్కసారిగా కోమటిరెడ్డి బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం జోరందుకుంది. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసి కోమటిరెడ్డి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఎవరికీ అందుబాటులో ఉండటం లేదనే అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆ మచ్చను చేరిపి వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుటకు పలువురికి సొంతంగా ఆర్థిక సహాయం అందజేయడం కొనసాగుతుంది. కానీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించాక పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో విఫలమయ్యారని సొంత పార్టీ క్యాడర్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తే కోమటిరెడ్డి గెలుపు అవకాశాలు ఎంత వరకు ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ బీజేపీ క్యాడర్ అంతంత మాత్రంగానే ఉన్న కోమటిరెడ్డితో కాంగ్రెస్ క్యాడర్ ఎంత వరకు కలిసి వస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితులు మునుగోడు పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందని పలువురు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఉపఎన్నికలపై ప్రజలు ఆసక్తి
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిందనే నమ్మకం ప్రజల్లో కలిగింది. దీంతో తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలు తమను వరిస్తాయని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమ బతుకులు బాగుపడతాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఓడినా గెలిచినా తమ నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుందో లేదో ఇక వేచి చూడాల్సి ఉంది.