4 ఏళ్లలో మొదటి సారి మస్క్‌ను దాటి రిచెస్ట్ పర్సన్‌గా అవతరించిన జుకర్‌బర్గ్

by Harish |
4 ఏళ్లలో మొదటి సారి మస్క్‌ను దాటి రిచెస్ట్ పర్సన్‌గా అవతరించిన జుకర్‌బర్గ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఇటీవల టెస్లా యజమాని ఎలాన్ మస్క్‌ను దాటి ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు. 2020 తరువాత మొదటిసారి మస్క్‌ను జూకర్ బర్గ్ అధిగమించడం విశేషం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మస్క్ నికర సంపద $180.6 బిలియన్లు, జుకర్‌బర్గ్ సంపద186.9 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మార్చి ప్రారంభంలో మొదటిస్థానంలో ఉన్న మస్క్, టెస్లా షేర్లు పడిపోవడంతో క్రమంగా ఆయన ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని కోల్పోతూ వస్తున్నారు.

టెస్లా వాహన డెలివరీలు మార్చి నుండి మూడు నెలల్లో పడిపోయాయని, ఇది కోవిడ్ మహమ్మారి ప్రారంభ రోజులతో పోలిస్తే క్షీణతగా పేర్కొన్నారు. మస్క్ సంపద ఈ సంవత్సరం $48.4 బిలియన్లు తగ్గిపోగా, అదే సమయంలో జుకర్‌బర్గ్ తన సంపదకు $58.9 బిలియన్లను జోడించారు. శుక్రవారం నాడు మెటా ప్లాట్‌ఫామ్ కొత్త రికార్డుతో సహా తాజా గరిష్టాలకు చేరుకుంది. నవంబర్ 16, 2020 నుండి జుకర్‌బర్గ్ బ్లూమ్‌బెర్గ్ అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

టెస్లా షేర్లు ఈ సంవత్సరం 34% పడిపోయాయి, ప్రపంచవ్యాప్తంగా EV డిమాండ్ మందగించడం, చైనాలో పెరుగుతున్న పోటీ, జర్మనీలో ఉత్పత్తి సమస్యల కారణంగా టెస్లాకు భారీ దెబ్బ తగిలింది. అదే సమయంలో మెటా బలమైన త్రైమాసిక ఆదాయాలు, కంపెనీ AI కార్యక్రమాల పట్ల ఉత్సాహం కారణంగా 49% పెరిగింది. ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ ధనవంతుల జాబితాలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటిస్థానంలో, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story