ఆఫ్‌లైన్ అమ్మకాలను పెంచే పనిలో షావోమీ ఇండియా!

by Vinod kumar |
ఆఫ్‌లైన్ అమ్మకాలను పెంచే పనిలో షావోమీ ఇండియా!
X

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో రిటైల్ ఔట్‌లెట్ల నుంచి అమ్మకాలను పెంచే దానిపై దృష్టి సారించనున్నట్టు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఇండియా వెల్లడించింది. తొలినుంచి ఆన్‌లైన్ అమ్మకాల నుంచి గణనీయమైన వృద్ధిని సాధిస్తున్న షావోమీ కంపెనీ ఇకమీదట రిటైల్ ఔట్‌లెట్ల నుంచి అమ్మకాలను పెంచాలని భావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో 44 శాతం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరుగుతున్నాయి. అయితే, ఇటీవల శాంసంగ్ నుంచి పెరిగిన పోటీని తట్టుకునేందుకు షావోమీ సంస్థ ఆన్‌లైన్ అమ్మకాలకే పరిమితం కాకుండా రిటైల్ ఔట్‌లెట్ల నుంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఉంది.

ఆఫ్‌లైన్ మార్కెట్లో తమ అమ్మకాలు ఆన్‌లైన్‌లో కంటే చాలా తక్కువగా ఉన్నాయని షావోమీ ఇండియా హెడ్ మురళీకృష్ణన్ బి అన్నారు. ఆఫ్‌లైన్ మార్కెట్లో ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు బలమైన పట్టు కలిగి ఉన్నాయి. ఈ ఏడాది తమ మొత్తం అమ్మకాల్లో ఆఫ్‌లైన్ నుంచి కేవలం 34 శాతమే జరిగాయి. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 18 వేల స్టోర్లు ఉన్నాయి. దీన్ని రానున్న రోజుల్లో గణనీయంగా విస్తరించే పనిలో ఉన్నాం. అలాగే, షావోమీ టీవీలు, సెక్యూరిటీ కెమెరా వంటి ఉత్పత్తులను కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని మురళీకృష్ణన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed