Women Borrowers : దేశంలో వేగంగా పెరుగుతున్న మహిళా రుణాలు

by S Gopi |
Women Borrowers : దేశంలో వేగంగా పెరుగుతున్న మహిళా రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ రుణాలను తీసుకునే మహిళలు గణనీయంగా పెరుగుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో అంటే 2019-2024 మధ్య రుణాలను పొందుతున్న మహిళలు ఏటా 22 శాతం పెరిగారని నీతి ఆయోగ్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిలి సంయుక్త ప్రకటనలో తెలిపాయి. గతంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు పెరిగిందని ఇరు సంస్థల సంయుక్త నివేదిక తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రవర్తనలో వస్తున్న మార్పును సూచిస్తుంది. ముఖ్యంగా మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకునేందుకు రుణాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని నివేదిక అభిప్రాయపడింది. 2019 నుంచి మహిళలు తీసుకునే వ్యాపార రుణాలు 14 శాతం, బంగారు రుణాలు 6 శాతం పెరిగాయి. అలాగే వ్యక్తిగత రుణాలు 39 శాతం నుంచి 42 శాతానికి స్వల్పంగా పెరిగాయి. మహిళల వ్యాపార రుణాలు పెరిగినప్పటికీ, మహిళలు రుణాలు తీసుకునే సాధణం ఎక్కువగా బంగారమే ఉంటోంది. 2019లో మహిళలు బంగారంపై తీసుకునే రుణాలు 19 శాతం ఉండగా, 2024 నాటికి ఇవి 36 శాతానికి పెరిగాయి. రుణాలు తీసుకుంటున్న మహిళల్లో 60 శాతం మంది సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారని నీతి ఆయోగ్ వివరించింది. మహిళలు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నప్పటికీ, మెజారిటీ మహిళలు దుస్తులు, టెక్స్‌టైల్స్, పొగాకు ఉత్పత్తులు, బ్యూటీ, ఫుడ్, డ్రింక్స్ వంటి రంగాల్లోనే ఉన్నారు. నివేదిక ప్రకారం, వ్యాపారాల కోసం మహిళలు కొత్తగా 37 లక్షల ఖాతాలు తెరిచారు. రూ. 1.9 లక్షల కోట్ల విలువైన రుణాలను తీసుకున్నారు. ఈ ఐదేళ్లలో ఖాతాల సంఖ్య 4.6 రెట్లు పెరిగినప్పటికీ, మొత్తం రుణాల్లో మహిళల రుణాలు 3 శాతం మాత్రమేనని నివేదిక వెల్లడించింది.

Next Story