మరికొంత కాలం స్టీల్ ధరలో హెచ్చుతగ్గులు తప్పవు: స్టీల్‌మింట్!

by Harish |   ( Updated:2023-03-08 14:00:59.0  )
మరికొంత కాలం స్టీల్ ధరలో హెచ్చుతగ్గులు తప్పవు: స్టీల్‌మింట్!
X

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మరికొంత కాలంపాటు స్టీల్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని స్టీల్‌మింట్‌ తెలిపింది. సరఫరా లాజిస్టిక్స్‌పై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ధరలు అస్థిరంగా ఉంటాయని అభిప్రాయపడింది. గతవారం స్టీల్ తయారీదారులు హాట్ రోల్డ్ కాయిల్(హెచ్ఆర్‌సీ) ధరలు టన్నుకు 59,300 నుంచి రూ. 1,400 పెంచి రూ. 60,700కి పెంచినట్టు స్టీల్‌మింట్ బుధవారం ప్రకటనలో వెల్లడించింది.

గత ఆరు నెలల నుంచి ఉక్కు ధరల్లో స్థిరత్వం లేదు. పరిశ్రమలో వారానికొకసారి ధరలు మారుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, దానివల్ల ముడి పదార్థాలు, లాజిస్టిక్స్ ధరలు దెబ్బతిని, డిమాండ్ సన్నగిల్లేందుకు కారణమవుతోందని స్టీల్‌మింట్ వివరించింది.

మరోవైపు ఐరన్ ఓర్ ధరలు సైతం గత ఏడాది డిసెంబర్ నాటికి రూ. 4,400 నుంచి ఫిబ్రవరి మూడో వారానికి టన్ను రూ. 5,480కి చేరుకుంది. అలాగే దిగుమతి చేసుకునే హార్డ్-కొకింగ్ బొగ్గు(హెచ్‌సీసీ) ధరలు కూడా టన్నుకు 263 డాలర్ల నుంచి 396 డాలర్లకు పెరిగిందని స్టీల్‌మింట్ వివరించింది. ఐరన్ ఓర్, హెచ్‌సీసీ స్టీల్ తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థాలు.

ఐరన్ ఓర్ దేశీయ గనుల నుంచి లభిస్తుండగా, హెచ్‌సీసీ దిగుమతులపై ఉక్కు తయారీదారులు ఎక్కువగా ఆధారపడతారు. వీటి ధరలు పెరగడంతో మొత్తంగా ఉక్కు ధరలు ఖరీదవుతున్నాయి. దాంతో దీనిపై ఆధారపడిన రియల్ ఎస్టేట్, నిర్మాణం, మౌలిక వసతులు, ఆటోమొబైల్‌, వినియోగ వస్తువులు, నివాస రంగాలన్నింటిపై ప్రభావం నేరుగా ఉంటుందని స్టీల్‌మింట్ పేర్కొంది.

Also Read..

మహిళలకు ప్రత్యేకంగా అధిక వడ్డీని అందించే పొదుపు పథకాలు!

Advertisement

Next Story

Most Viewed