2026-27 నాటికి రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీలు: పీడబ్ల్యూసీ ఇండియా!

by Dishaweb |
2026-27 నాటికి రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీలు: పీడబ్ల్యూసీ ఇండియా!
X

న్యూఢిల్లీ: దేశంలో యూపీఐ లావాదేవీలు రానున్న మూడు నాలుగేళ్లలో గణనీయంగా పెరగనున్నాయి. వేగవంతమైన వృద్ధితో 2026-27 నాటికి యూపీఐ లావాదేవీలు రోజుకు 100 కోట్లకు చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. నిర్దేశించిన సమయానికి దేశంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటాను యూపీఐ లావాదేవీలు దక్కించుకుంటాయని నివేదిక అభిప్రాయపడింది. డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ లావాదేవీలు 2022-23లో మొత్తం లావాదేవీల్లో 75 శాతం వాటాకు చేరుకున్నాయి. భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్ సగటున 50 శాతం వృద్ధిని కలిగి ఉంది. దీని ప్రకారం, 2022-23లో 103 బిలియన్ల నుంచి 2026-27 నాటికి 411 బిలియన్ల లావాదేవీలకు చేరుకుంటాయని నివేదిక వెల్లడించింది.

యూపీఐ తర్వాత రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువగా ఉపయోగించే సాధనాల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల విభాగాలు ఒకే స్థాయి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. వాటిలో క్రెడిట్ కార్డుల విభాగంలో మరింత వేగవంతం కావడం ద్వారా 2024-25 నాటికి డెబిట్ కార్డుల విభాగాన్ని అధిగమిస్తుందని నివేదిక అంచనా వేసింది. రానున్న మూడు నాలుగేళ్లలో క్రెడిట్ కార్డుల జారీ సగటున ఏడాదికి 21 శాతం పెరగనుంది. డెబిట్ కార్డుల జారీ ఏడాదికి సగటున 3 శాతం పెరగనుంది. సాధారణంగా డెబిట్ కార్డులను నగదు విత్‌డ్రాకు మాత్రమే వినియోగిస్తారు. అయితే, ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు పెరిగిపోవడంతో డెబిట్ కార్డుల జారీ తగ్గిపోతోంది.

Advertisement

Next Story