ఈసారి బడ్జెట్లో ప్రయోజనాలేమీ ఉండవు

by S Gopi |   ( Updated:2024-01-09 10:19:27.0  )
ఈసారి బడ్జెట్లో ప్రయోజనాలేమీ ఉండవు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్‌పై సామాన్యుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వేతనజీవులు పన్ను సంబంధిత ప్రయోజనాలపై ఎన్నో ఆశలతో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఏడాదికి సంబంధించి ఎన్నికలు ఉన్న కారణంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ప్రకటించే ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలు ఏమీ ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు ఓట్-ఆన్-అకౌంట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీని ప్రస్తుతం ఉన్న రూ. 7 లక్షల నుంచి రూ. 7.5 లక్షలకు పెంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన అధికారి, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. కాగా, ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు విదేశీ క్రెడిట్, డెబిట్ కార్డు ఖర్చులపై మూలం వద్ద పన్ను(టీసీఎస్) మినహాయింపును కేంద్ర ప్రకటించవచ్చని మరో అధికారి పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్, కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునేవారికి ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. కుటుంబ పింఛనుపై రూ. 15,000 తగ్గింపును కూడా ఇచ్చారు.

Advertisement

Next Story