ఫోన్ నంబర్లకు ఛార్జీలపై ట్రాయ్ స్పష్టత

by S Gopi |
ఫోన్ నంబర్లకు ఛార్జీలపై ట్రాయ్ స్పష్టత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు ఛార్జీలు వసూలు చేయవచ్చని వచ్చిన వార్తలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఖండించింది. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని శుక్రవారం ప్రకటనలో స్పష్టం చేసింది. అధిక సిమ్ కార్డులు వాడకాన్ని నియంత్రించేందుకు ట్రాయ్ ఛార్జీలు విధించాలని భావిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని పేర్కొంది. దేశంలోని పెరుగుతున్న మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ కొత్త నంబరింగ్ విధానం కోసం ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దాంతో నంబర్లకు ఛార్జీలు వసూలు చేసేందుకు ట్రాయ్ భావిస్తోందని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అనవసర ఊహాగానాలకు చెక్ పెడుతూ ప్రకటన విడుదల చేసింది. టెలీకమ్యూనికేషన్‌ ఐడెంటిఫైర్స్‌ వనరులపై పూర్తి నియంత్రణ ఉన్న టెలికాం శాఖ తమని సంప్రదించి నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌పై ప్రతిపాదనలు అడిగింది. అందుకే చర్చా పత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విషయమై సవరణలను ప్రతిపాదించామని ట్రాయ్ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed