ప్రపంచంలోనే అత్యధిక పన్ను వసూళ్లు భారత్‌లోనే: సుర్జిత్ భల్లా!

by Vinod kumar |
ప్రపంచంలోనే అత్యధిక పన్ను వసూళ్లు భారత్‌లోనే: సుర్జిత్ భల్లా!
X

న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం కాకపోయినప్పటికీ పన్ను వసూళ్లు మాత్రం అత్యధికంగా ఉన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 40 శాతం ఉన్న ఆదాయ పన్నును 25 శాతానికి కుదించాలని సూచించారు. ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు పన్ను రేటు తగ్గింపు అవసరమని అన్నారు. రాష్ట్ర, కేంద్రం, స్థానిక సంస్థలు కలిపి దేశ జీడీపీలో 19శాతం ఉన్నాయి. దీన్ని 2 శాతం పాయింట్లు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రత్యక్ష పన్నుల విషయంలోనూ అన్ని రకాల పన్నులు కలిపి 25 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. సర్వీస్ ఛార్జీలతో కలిపి ప్రస్తుతం 40 శాతానికి చేరువలో ఉంది.

కార్పొరేట్ పన్ను రేటు తరహాలోనే ఆదాయ పన్ను కూడా ఉండాలని ఆయన వివరించారు. ఆర్థికవ్యవస్థలో కొన్ని వర్గాలకే ప్రయోజనం అందేలా కాకుండా అన్ని వర్గాలకూ పన్నుల తగ్గింపు ఉండాలని తెలిపారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రభుత్వాధికారుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. పన్నుల ఎగవేతను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20 శాతం పెరిగి రూ. 19.68 లక్షల కోట్లకు చేరాయి. అందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు 16.91 శాతం వృద్ధితో రూ. 10.04 లక్షల కోట్లకు, వ్యక్తిగత పన్ను వసూళ్లు 24.23 శాతం పెరిగి రూ. 9.60 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story