ఒక్కసారి ఛార్జింగ్‌తో 315 కిలోమీటర్లు ప్రయాణించే టాటా టియాగో ఈవీ విడుదల!

by Seetharam |
ఒక్కసారి ఛార్జింగ్‌తో 315 కిలోమీటర్లు ప్రయాణించే టాటా టియాగో ఈవీ విడుదల!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన టియాగో ఎలక్ట్రిక్ మోడల్‌ను బుధవారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 8.49 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త టాటా ఈవీ కోసం అక్టోబ 10వ తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, కంపెనీకి చెందిన అధికారిక డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ. 21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. బుకింగ్ చేసుకున్న వాహనాల డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో అత్యంత సరసమైన ధరలో తీసుకొచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ వంటి 4 ట్రిమ్‌లలో అందుబాటులో ఉండనుంది. వీటి ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షలుగా ఉంది. ఈ కారు బ్యాటరీ, మోటార్ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారెంటీతో వస్తుంది. టియాగో ఈవీ కేవలం 5.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుంది. 19.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు, 24 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story