గో ఫస్ట్ ప్రభావంతో పెరగనున్న విమాన టికెట్ ధరలు!

by Harish |
గో ఫస్ట్ ప్రభావంతో పెరగనున్న విమాన టికెట్ ధరలు!
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న దేశీయ విమానయాన పరిశ్రమ కొత్త సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో బడ్జెట్‌ ధరలో విమాన సేవలు అందించే గోఫస్ట్‌ సంస్థ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేయడం, దివాలా పరిష్కారానికి ఆశ్రయించడం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ ప్రభావం విమాన ప్రయాణీకులపైన కూడా పడుతుందని, విమాన టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న ఏవియేషన్ రంగానికి ఇది బ్యాడ్‌న్యూస్ అని విశ్లేషకులు తెలిపారు. గోఫస్ట్‌కు చెందిన మెజారిటీ విమానాలు నిలిచిపోవడంతో విమానాల సామర్థ్యం తగ్గి కొన్ని రూట్లలో టికెట్ ధరలు పెరుగుతాయని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఏఏఐ) అద్యక్షురాలు జ్యోతి మయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

వేసవి సెలవుల సమయంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో గో ఫస్ట్ సంస్థ ప్రకటన రానున్న వారాల్లో విమాన టికెట్ ధరలపై ప్రభావం చూపుతుందన్నారు. తాజా వివరాల ప్రకారం, గో ఫస్ట్ సంస్థ వేసవి సీజన్‌లో భాగంగా మార్చి 26 నుంచి అక్టోబర్‌ 28 మధ్య వారానికి 1538 విమానాలను నడపాల్సి ఉందని టీఏఏఐ పేర్కొంది.

Advertisement

Next Story