Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల మద్దతుకు తోడు వరుస రికార్డు నష్టాల తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, దిగ్గజ షేర్లలో నిధుల ప్రవాహం వంటి పరిణామాలతో అత్యధిక లాభాల్లో ర్యాలీ చేశాయి. మంగళవారం కేంద్రం లాంగ్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సంబంధించి సడలింపు ఇస్తూ ప్రకటించిన నేపథ్యంలో రియల్టీ రంగ షేర్లలో ఉత్సాహం కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 874.94 పాయింట్లు పుంజుకుని 79,469 వద్ద, నిఫ్టీ 304.95 పాయింట్లు లాభపడి 24,297 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, ఫార్మా, రియల్టీ సహా అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకి షేర్లు లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed