వరుసగా మూడో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు!

by Harish |
వరుసగా మూడో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలను సాధించాయి. గురవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన సూచీలు మిడ్-సెషన్ సమయం వరకు మెరుగ్గా ర్యాలీ అయ్యాయి. రోజంతా అధిక లాభాల్లోనే కదలాడిన తర్వాత చివరి గంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఆఖర్లో తక్కువ లాభాలతో మార్కెట్లు ముగిశాయి.

వరుస లాభాల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠాలకు చేరడం, వీక్లీ ఆప్షన్స్ గడువు ముగుస్తున్న ప్రభావం కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ రంగంలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయి. మరోవైపు విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు ద్వారా ఆయిల్ రంగ కంపెనీల షేర్లలో ర్యాలీ కనిపించింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 44.42 పాయింట్లు లాభపడి 61,319 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18,035 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, రియల్టీ రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా దాదాపు 6 శాతం రాణించడం విశేషం.

నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.69 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed