SIP: తొలిసారి రికార్డు స్థాయిలో రూ. 25,000 కోట్లు దాటిన సిప్ పెట్టుబడులు

by S Gopi |
SIP: తొలిసారి రికార్డు స్థాయిలో రూ. 25,000 కోట్లు దాటిన సిప్ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా పెట్టుబడిదారులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్‌లో వచ్చిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనం. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం (యాంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం, గత నెలలో సిప్ పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ. 25,323 కోట్లు రాగా, అంతకుముందు సెప్టెంబర్ 24,509 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు తొలిసారిగా రూ. 25 వేల కోట్ల మార్కును దాటడం విశేషం. సిప్‌లో కొత్తగా 63.7 లక్షల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. అంతకుముందు నెలలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన 58.7 లక్షల కంటే ఈసారి మరింత పెరగడం గమనార్హం. దీంతో మొత్తం సిప్ అకౌంట్ల సంఖ్య 10.12 కోట్లకు చేరాయని, ఇది అంతకుముందు నెల కంటే 2.5 శాతం పెరిగినట్టు యాంఫీ పేర్కొంది. ఇదే సమయంలో సిప్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 13.30 లక్షల కోట్లకు చేరుకున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలో స్థిరమైన ర్యాలీ కారణంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ వరుసగా 44 నెలల పాటు సానుకూల పెట్టుబడులను సాధిస్తోందని యాంఫీ వెల్లడించింది. ఇక, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి గత నెల రూ.41,887 కోట్ల పెట్టుబడులు వచ్చాయని యాంఫీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed