12 ఏళ్ల గరిష్ఠానికి సేవల రంగం వృద్ధి!

by Prasanna |
12 ఏళ్ల గరిష్ఠానికి సేవల రంగం వృద్ధి!
X

న్యూఢిల్లీ: భారత సేవల రంగం ఈ ఏడాది ఫిబ్రవరిలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఆర్డర్లు ఊపందుకోవడం, వ్యాపార కార్యకలాపాల్లో వేగవంతమైన పెరుగుదల ఇందుకు దోహదం చేసింది. దాంతో ఎస్అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) గత నెలలో ఏకంగా 12 ఏళ్ల గరిష్ఠంతో 59.4 పాయింట్లకు పెరిగింది. అంతకుముందు జనవరిలో సర్వీసెస్ పీఎంఐ 57.2 పాయింట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో నమోదైన సూచీ 2011, ఫిబ్రవరి తర్వాత అత్యధికం కావడం గమనార్హం. కొత్త పనులకు గిరాకీ పుంజుకుకోవడం కలిసొచ్చింది. అంతేకాకుండా 2021, ఆగష్టు తర్వాత వరుసగా 19వ నెలా సేవల రంగం వృద్ధిని సాధించింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి కింద నమోదైతే క్షీణతగానూ, 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధిగానూ పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. జనవరిలో స్వల్పంగా నెమ్మదించిన సేవల రంగం వృద్ధి తిరిగి గాడిన పడింది. డిమాండ్, ధరలు స్థిరంగా ఉండటంతో వ్యాపార కార్యకలాపాలు 11 ఏళ్లలోనే వేగవంతమైన వృద్ధిని సాధించాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా చెప్పారు.

Advertisement

Next Story