లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జోరు కారణంగా సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లను మదుపర్లు అధికంగా కొనుగోలు చేశారు. అమెరికా ఫెడ్ మినిట్స్‌కు ముందు గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయంగా త్రైమాసిక ఫలితాలు, దిగ్గజ కంపెనీల షేర్లు, ఎన్నికల కారణంగా గత వారం బలహీనపడిన ర్యాలీ నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు రాణించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 267.75 పాయింట్లు లాభపడి 74,221 వద్ద, నిఫ్టీ 68.75 పాయింట్ల లాభంతో 22,597 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఐటీ, మీడియా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.28 వద్ద ఉంది.

Advertisement

Next Story