భారీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2023-01-10 12:28:14.0  )
భారీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస మూడు రోజుల నష్టాల నుంచి బయటపడ్డాయి. 2023 ప్రారంభ మొదటి వారంలో నష్టాలను చూసిన సూచీలు సోమవారం ర్యాలీతో సానుకూలంగా ట్రేడయ్యాయి. ఉదయం నుంచే అధిక లాభాలతో పుంజుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు, భారత కరెన్సీ రూపాయి బలపడటం, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఐటీ రంగం ర్యాలీ చేయడం వంటి కారణాలతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగ రేటు మెరుగుపడటం, చైనాలో కొవిడ్ ఆంక్షలను సడలించడంతో మార్కెట్లలో ఎక్కువ లాభాలకు కారణమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 846.94 పాయింట్లు ఎగసి 60,747 వద్ద, నిఫ్టీ 241.75 పాయింట్లు లాభపడి 18,101 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం ఏకంగా 3 శాతం వరకు దూసుకెళ్లగా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను చూశాయి. మిగిలిన అన్ని షేర్లు పుంజుకున్నాయి.

ముఖ్యంగా ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.37 వద్ద ఉంది.

స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు పెరిగి రూ. 282.79 లక్షల కోట్లకు పెరిగింది.

ఇవి కూడా చదవండి : LIC అదిరిపోయే ప్లాన్.. ప్రతి నెలా రూ. 11 వేలకు పైగా పొందొచ్చు

Advertisement

Next Story

Most Viewed