Stock Market: వరుసగా రెండోరోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: వరుసగా రెండోరోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుసగా రెండో రోజు లాభాలు నమోదయ్యాయి. గతవారం నష్టాల నుంచి బయటపడిన సూచీలు మంగళవారం సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుకు తోడు కీలక యూఎస్ మార్కెట్లలో రికవరీ కలిసొచ్చింది. వీటికితోడు దేశీయంగా ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించడం, యూఎస్ ద్రవ్యోల్బణం, ఫెడ్ పాలసీ వైఖరిపై గ్లోబల్ ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో మన మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. అయితే అమెరికాలో రాజకీయాలు, మాంద్యం భయాలు రానున్న రోజుల్లో యూఎస్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, దేశీయంగా రుతుపవనాలు సానుకూలంగా ఉండటం, పండుగ సీజన్ మొదలవడంతో వినియోగ డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 361.75 పాయింట్లు లాభపడి 81,921 వద్ద, నిఫ్టీ 104.70 పాయింట్లు పెరిగి 25,041 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఐటీ, ఫార్మా రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, టైటాన్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed