ఈరోజు అధిక లాభాల్లో మునిగి తేలిన సూచీలు!

by Harish |
ఈరోజు అధిక లాభాల్లో మునిగి తేలిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మెరుగైన లాభాలను సాధించాయి. సోమవారం ఉదయం నుంచే అధిక లాభాలతో ర్యాలీ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా అమెరికా రుణ పరిమితికి సూత్రప్రాయ ఆమోదం లభించిన కారణంగా గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా మారాయి. ఇదే సమయంలో దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

అలాగే, హిండెన్‌బర్గ్ ఆరోపణలతో దెబ్బతిన్న అదానీ షేర్లు ఇటీవల పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ట్రేడింగ్‌లోనూ అదానీ కంపెనీల షేర్లు పెరగడంతో భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. ఓ దశలో బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సూచీ కీలక 63 వేల మార్కును చేరింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 344.69 పాయింట్లు ఎగసి 62,846 వద్ద, నిఫ్టీ 99.30 పాయింట్లు లాభపడి 18,598 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకి, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.62 వద్ద ఉంది.

Advertisement

Next Story