తొలిసారి 76,000 మైలురాయి తాకిన సెన్సెక్స్

by Gopi |
తొలిసారి 76,000 మైలురాయి తాకిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో తక్కువ లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత పుంజుకున్నాయి. భారీ లాభాలతో ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ చరిత్రలో తొలిసారిగా 76,000 మైలురాయిని తాకింది. అయితే, ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కీలక రంగాల షేర్లలో అమ్మకాలను పెంచడంతో సూచీలు బలహీనపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 19.89 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద, నిఫ్టీ 24.65 పాయింట్ల నష్టంతో 22,932 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. విప్రో, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, ఐటీసీ, రిలయన్స్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.11 వద్ద ఉంది.

Next Story