వారాంతం తక్కువ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం తక్కువ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం బలహీనంగా ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో రాణించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు అత్యల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతున్నప్పతికీ, గత కొద్దిరోజులుగా జరిగిన ర్యాలీతో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఇదే సమయంలో కీలక కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్లు నీరసించాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, యూఎస్ బాండ్ల రాబడితో పాటు అధిక వాల్యుయేషన్‌ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 15.44 పాయింట్లు క్షీణించి 73,142 వద్ద, నిఫ్టీ 4.75 పాయింట్లు నష్టపోయి 22,212 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, టైటాన్, విప్రో, రిలయన్స్, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.93 వద్ద ఉంది.

Advertisement

Next Story