ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. గురువారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు కీలక ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఆసియా మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలతో కొద్దిసేపు లాభాల్లో కదలాడిన సూచీలు మిడ్-సెషన్ నుంచి ఊగిసలాటకు లోనయ్యాయి. ట్రేడింగ్ ఆఖర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 34.09 పాయింట్ల నష్టంతో 72,152 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 1.10 పాయింట్లు పెరిగి 21,930 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మిగిలిన రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.98 వద్ద ఉంది.

Advertisement

Next Story