Stock Market: భారత స్టాక్ మార్కెట్లలో 'బ్లడ్‌బాత్'

by S Gopi |
Stock Market: భారత స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీల్లో పెద్ద ఎత్తున నష్టాలను నమోదవడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. ముఖ్యంగా అమెరికాలో మాంద్యం భయాల కారణంగా అక్కడి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీనివల్ల భారత ఈక్విటీల్లో భయాలు పెరగడంతో సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 2,000 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 600 పైగా దెబ్బతిన్నది. ప్రధానంగా అమెరికా జూలై నెల నియామకాల ధోరణి ఊహించిన దానికంటే భారీగా మందగించింది. అంచనాల కంటే దాదాపు 60 లక్షల తక్కువ ఉద్యోగాల కల్పన జరిగినట్టు డేటా వెలువడటంతో మాంద్యం తప్పదనే ఊహాగానాలు పెరిగాయి. మరోవైపు, జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బాండ్ల కొనుగోళ్లను కూడా తగ్గించడంతో జపాన్ కరెన్సీ యెన్ బలపడింది. దానివల్ల పెట్టుబడిదారులు వాటాలను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అలాగే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత క్షీణించడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ఇదే సమయంలో దేశీయంగా కూడా వరుస రికార్డు లాభాల కారణంగా మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,222.55 పాయింట్లు కుదేలై 78,759 వద్ద, నిఫ్టీ 662.10 పాయింట్లు పతనమై 24,055 వద్ద ముగిశాయి. నిఫ్టీ అన్ని రంగాలు 2-5 శాతం మధ్య క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లోనూ హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా మినహా అన్ని కంపెనీల షేర్లు పడిపోయాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ 7 శాతానికి పైగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి.

టాప్-5 సెన్సెక్స్ నష్టాలివే..

అమెరికా మార్కెట్ల పతనానికి తోడు గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభం వల్ల భారత స్టాక్ మార్కెట్లు రికార్డు నష్టాలను ఎదుర్కొన్నాయి. సోమవారం నాటి నష్టాలు బీఎస్ఈ చరిత్రలో నమోదైన నాలుగో అతిపెద్ద నష్టం కావడం గమనార్హం. కొవిడ్-19 మహమ్మారి దెబ్బకు మార్చి 20, 2020 రోజున సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్లు దెబ్బతినగా, అదే నెలలో 12న 2,919 పాయింట్లు, 16న 2,716 పాయింట్లు కుదేలయ్యాయి. వీటి తర్వాత సోమవారం(5, ఆగష్టు, 2024) నష్టాలే అత్యధికం. దీని తర్వాత 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలవడంతో 2 వేలకు పైగా క్షీణించాయి.

ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి..

సోమవారం స్టాక్ మార్కెట్ల బ్లడ్ బాత్ కారణంగా అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో డాలర్ బలపడిన కారణంగా రూపాయి విలువ బలహీనపడింది. భారత మార్కెట్లలోనూ భారీ పతనం, విదేశీ మదుపర్లు నిధులను వెనక్కి తీసుకోవడం కూడా దేశీయ కరెన్సీ నీరసించిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ రూ. 84.15 వద్ద ఉంది.

ఒక్కరోజే రూ. 15 లక్షల కోట్లు ఆవిరి..

చాలాకాలం తర్వాత భారత మార్కెట్లు భారీ పతనాన్ని చూడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ. 15.34 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 441.82 లక్షల కోట్లకు చేరుకుంది.

యూఎస్, జపాన్ మార్కెట్ల పతనం..

అమెరికా ఆర్థికవ్యవస్థ నెమ్మదిస్తుందని, మాంద్యం తప్పదనే అంచనాలు పెరగడంతో సోమవారం వాల్‌స్ట్రీట్‌లో షేర్ల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంచనాలు తప్పిన ఉపాధి డేటా ప్రభావంతో డోజోన్స్ 800 పాయింట్లు కోల్పోయింది. నాస్‌దాక్ 2.4 శాతం, ఎస్అండ్‌పీ ఫ్యూచర్స్ 3 శాతం దెబ్బతిన్నాయి. ట్రెజరీ దిగుమతులు క్షీణించాయి. జపాన్ మార్కెట్లలోనూ నిక్కీ దాదాపు 13 శాతం కుదేలైంది.

Advertisement

Next Story

Most Viewed