అధిక వడ్డీతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌ను తీసుకొచ్చిన ఎస్‌బీఐ!

by Harish |
అధిక వడ్డీతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌ను తీసుకొచ్చిన ఎస్‌బీఐ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారుల కోసం బుధవారం కొత్తగా 400 రోజుల కాలవ్యవధి కలిగిన ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డిపాజిట్‌పై అత్యధికంగా 7.10 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఇది ప్రస్తుత ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎంపిక చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు బ్యాంకు ప్రకటించింది.

ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎస్‌బీఐ సైతం 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఎఫ్‌డీలపై పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి రానున్నాయి. చివరిగా ఎస్‌బీఐ గతేడాది డిసెంబర్‌లో డిపాజిట్లపై వడ్డీ రేట్లను 65 బేసిస్ పాయింట్లు పెంచింది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 7-45 రోజుల డిపాజిట్లపై 3 శాతం, 46-175 రోజులకు 4.5 శాతం, 180-210 రోజులకు 5.25 శాతం, 211 రోజుల నుంచి ఏడాది కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 5.75 శాతం, 1-2 ఏళ్లకు 6.8 శాతం, 2-3 ఏళ్లకు 7 శాతం, 3-10 ఏళ్ల మధ్య డిపాజిట్లకు 6.5 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ అందుతుంది.

Advertisement

Next Story

Most Viewed