తుడిచిపెట్టుకుపోయిన రూ. 30 లక్షల కోట్లు.. మార్కెట్ల రికార్డు పతనం

by S Gopi |
తుడిచిపెట్టుకుపోయిన రూ. 30 లక్షల కోట్లు.. మార్కెట్ల రికార్డు పతనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊహించని షాక్ ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌లో అధికార బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడం లేదని గ్రహించిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో రికార్డు గరిష్ఠాలకు ఉరకలెత్తిన స్టాక్ మార్కెట్లు ఫలితాలు అందుకు భిన్నంగా ఉండటంతో నష్టాలు అంతకుమించి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారం కోసం ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లను దాటినప్పటికీ అంచనాలు గతంలో కంటే అధికంగా 350కి మించి వస్తాయని ఉండేవి. కానీ 300 స్థానాల దరిదాపుల్లోనే ఎన్డీఏ గెలవడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. పైగా, గత రెండు ఎన్నికల్లో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈసారి భాగస్వామ్య పార్టీల అవసరం ఉండటం కూడా మదుపర్లకు నిరాశ కలిగించింది. దీనికితోడు ప్రతిపక్ష కాంగ్రెస్ స్వయంగా 150 సీట్ల వరకు గెలవడం, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి దాదాపు 250 వరకు సీట్లను గెలవడంతో స్టాక్ మార్కెట్ల నష్టాలు పెరిగేందుకు దోహదపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో బ్యాంకింగ్ ప్రధానంగా 8 శాతం వరకు దెబ్బతినగా, మిగిలిన రంగాలు సైతం 5-12 శాతం వరకు క్షీణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 4,389.73 పాయింట్లు పతనమై 72,079 వద్ద, నిఫ్టీ 1,379.40 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే రాణించగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం ఏకంగా 15.14 శాతం పడిపోయింది. మిగిలిన రంగాలు భారీగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీఅర్, నెస్లె ఇండియా, టీసీఎస్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ స్టాక్స్ 8-16 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.57 వద్ద ఉంది.

ఊహించని ఫలితాలతో మంగళవారం ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 30 లక్షల కోట్లు ఆవిరైంది. దాంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 396 లక్షల కోట్లకు దిగజారింది.

టాప్-5 పతనాలు..

మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇండెక్స్ ఒకదశలో 8.5 శాతం(6,235 పాయింట్లు) పడిపోయింది. ఇది 2020, మార్చిలో కొవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన నష్టం ఎక్కువ. అయితే, ఆ తర్వాత కోలుకుని చివర్లో సెన్సెక్స్ 5.74 శాతం నష్టంతో సరిపెట్టింది. ఇది ఈ ఏడాది ప్రారంభం నుంచి వచ్చిన లాభాలన్నిటినీ తుడిచిపెట్టేసింది. ఈ క్రమంలో గతంలో వచ్చిన టాప్-5 నష్టాల గురించి తెలుసుకుందాం.

* 2024, జూన్ 4 సెన్సెక్స్ ఒక్కరోజే 8.15 శాతం నష్టంతో 70,234 కనిస్ఠాన్ని ఎదుర్కొంది.

* 2020, మార్చి 23న సెన్సెక్స్ ఇండెక్స్ ఇంట్రాడేలో 13.49 శాతం క్షీణించి 25,881 కన్సిహ్ఠాన్ని చూసింది.

* 2020, మార్చి 16న 8.28 శాతం(31,276 పాయింట్లకు) పడిపోయింది.

* 2020, మార్చి 13న 10.34 శాతం(29,289 పాయింట్లకు) క్షీణించింది.

* 2020, మార్చి 12న 8.98 శాతం(32,493 పాయింట్లకు) చేరింది.

Advertisement

Next Story