20 శాతం పెరగనున్న ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీల ఆదాయం: క్రిసిల్

by Harish |
20 శాతం పెరగనున్న ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీల ఆదాయం: క్రిసిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్థిరమైన రాబడి వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీల ఆదాయం 20 శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత కొన్నేళ్లుగా ఆత్మనిర్భర్ భారత్ చొరవ, డిఫెన్స్ అక్విజిషన్ పాలసీ వలన ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల ఆర్డర్‌బుక్‌లు భారీగా పెరిగాయి. దీంతో ఎఫ్‌వై25లో 25 ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీల ఆదాయాలు రూ. 13,500 కోట్లకు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. ఇది ఎఫ్‌వై21తో పోలిస్తే రెండింతలు కావడం విశేషం. క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ మాట్లాడుతూ, ఆర్డర్ బుక్‌ల ద్వారా డిఫెన్స్ కంపెనీల ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరంలో 3.5 రెట్లు ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 4.5 రెట్లు మెరుగుపడుతుందని అంచనా వేశారు. నిరంతర ఆదాయ వృద్ధి, ఆర్థిక వ్యవస్థలు వలన కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ 50-60 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ సజేష్ కెవి మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన ఢిఫెన్స్ కంపెనీలు తమ ప్రస్తుత సామర్థ్యాలను 12-14 శాతం విస్తరించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 650-700 కోట్ల మూలధన వ్యయం (కాపెక్స్) పొందవచ్చు. పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ ఖర్చుల కారణంగా దీనికి అదనంగా రూ. 600-700 కోట్లు అవసరమవుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బలమైన బ్యాలెన్స్ షీట్లు, ఆరోగ్యకరమైన లాభదాయకత కారణంగా నిధుల సమీకరణ కూడా సులభం అయ్యే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed