- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
భారత్‌లో కొత్త కార్ల తయారీకి నిస్సాన్, రెనాల్ట్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థలైన నిస్సాన్, రెనాల్ట్ తమ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించిన తర్వాత సంయుక్త వ్యాపార వ్యూహాలను సోమవారం ప్రకటించాయి. అందులో భాగంగా ఇరు కంపెనీలు ఉత్పత్తి, ఆర్అండ్‌డీ కార్యకలాపాలను పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాలు, కార్బన్ న్యూట్రల్ తయారీకి మారడం వంటి లక్ష్యాలను నిర్దేశించాయి. వీటికోసం ఇరు కంపెనీలు సుమారు రూ. 5,300 కోట్ల(600 మిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెడతామని చెప్పాయి.
చెన్నైలోని ప్లాట్ నుంచి రెండు పూర్తి ఈవీలతో పాటు కొత్త వాహనాల తయారీ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపాయి. దీని ద్వారా చెన్నైలోని రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్‌లో పెట్టుబడులతో కొత్తగా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇరు కంపెనీలు మూడు మోడళ్ల చొప్పున దేశీయంగా తయారు చేయనున్నాయి. అందులో నాలుగు ఎస్‌యూవీ మోడళ్లు, రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. ఈ మోడళ్లను భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారు చేయడమే కాకుండా ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంలో భాగంగా రూపొందిస్తామని కంపెనీలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా చెన్నైలోని తమ ప్లాంట్ 2045 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారుతుందని, ఇప్పటి నుంచి ప్లాంటులో ఇంధన వినియోగాన్ని 50 శాతం తగ్గిస్తూ, 100 శాతం పునరుత్పాదకతకు మారేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కంపెనీలు హామీ ఇచ్చాయి. ఇప్పటికే ఈ ప్లాంటులో 50 శాతానికి పైగా విద్యుత్ సౌర, బయోమాస్, విండ్ రూపాల్లో వినియోగిస్తున్నారు. కాగా, ఇటీవల ఇరు కంపెనీల భాగస్వామ్యాన్ని సమతుల్యం చేసేందుకు నిస్సాన్‌లో రెనాల్ట్ తన వాటాను 15 శాతానికి తగ్గించుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.