Adani Group: అదానీకి ట్రంప్ గుడ్ న్యూస్

by S Gopi |
Adani Group: అదానీకి ట్రంప్ గుడ్ న్యూస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయంతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి భారీ ఉపశమనం లభించింది. గతేడాది సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల వ్యవహారంలో లంచం ఇచ్చిన ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అమెరికా ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ) కింద గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌, కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి కేసు నమోదైంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (ఎఫ్‌సీపీఏ) నిలిపేయాలని న్యాయ శాఖకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు దాదాపు 50 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని పాజ్ చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతం చేశారు. 'ఈ చట్టం కాగితాలపై బాగుంది, కానీ ఆచరణలో ఇది విపత్తు లాంటిది. ఒక అమెరికన్ కంపెనీ విదేశాల్లో వ్యాపారం చేయడానికి వెళ్తే చట్టబద్ధంగా దాదాపు హామీ ఇచ్చినట్టుగానే పరిగణించాలి. కానీ ఈ చట్టం వల్ల అమెరికా కంపెనీలతో ఎవరూ వ్యాపారం చేసేందుకు ఇష్టపడరని' ట్రంప్ వ్యాఖ్యానించారు. 1977 నాటి ఎఫ్‌సీపీఏ చట్టం అమెరికన్ కంపెనీలు, విదేశీ సంస్థలు వ్యాపారం కోసం విదేశీ ప్రభుత్వాల అధికారులకు లంచం ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా నిర్ణయంతో అదానీ గ్రూప్‌నకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. దీనికి సంబంధించి అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బొండిని ఆయన ఆదేశించారు. ఈ చట్టం మార్గదర్శకాలు, విధివిధానాలను 180 రోజుల్లోగా సమీక్షించాలని సూచించారు. తద్వారా ఆరు నెలల వరకు ఈ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు జరగదు. అయితే, ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి అదానీ గ్రూప్ అంశం ఉండనుంది.

భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం గౌతమ్ అదానీ, సాగర్‌ అదానీతో పాటు మరో ఆరుగురు 2020-24 మధ్య భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని న్యూయార్క్‌ కోర్టులో గతేడాది నవంబర్ 20న కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అమెరికా ఇన్వెస్టర్లకు చెందిన నిధులు కూడా ఉండడంతో గత జో బైడెన్‌ సర్కారు ఎఫ్‌సీపీఏ చట్టం కింద విచారణకు ఆదేశించింది. ఈ చట్టాన్ని నిలిపేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. అదానీపై ఈ ఎఫ్‌సీపెఏతో పాటు సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ కేసు నమోదైంది. ఈ చట్టాల్లో నేరం నిరూపణ అయితే కఠిన శిక్షలు అమలు చేస్తారు.

ఎందుకు నిలిపేశారు?

రాయిటర్స్ ప్రకారం, 1977 నాటి ఎఫ్‌సీపీఏ చట్టాన్ని సవరించి, సహేతుకమైన మార్గదర్శకాలను రూపొందించడం ద్వారా అమెరికా కంపెనీల పోటీతత్వాన్ని పునరుద్ధరించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, దాని కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక వాణిజ్య ప్రయోజనాలను పొందడంపై ఆధారపడే అమెరికన్ జాతీయ భద్రత ఉంటుంది. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ కంపెనీలు మెరుగైన పోటీత్వత్వాన్ని కొనసాగించేందుకు ఎఫ్‌సీపీఏ అడ్డుగా ఉందని భావిస్తున్నారు.

అదానీకి ఊరట లభిస్తుందా?

ప్రస్తుత, గత ఎఫ్‌సీపీఏ-సంబంధిత కేసులన్నీ సమీక్షించనున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అటార్నీ జనరల్ పామ్ బోండి కొత్త, సవరించిన మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత, భవిష్యత్తులో అన్ని ఎఫ్‌సీపీఏ కింద చర్యలకు అటార్నీ జనరల్ నుంచి ఆమోదం అవసరమవుతుంది. కాబట్టి ఈ కేసులో ఉన్న అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల పేర్లను తొలగిస్తే, అది గౌతమ్ అదానీ, ఇతరులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.



Next Story