ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ 'అజొర్టె'ను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్!

by Harish |   ( Updated:2022-09-29 11:18:59.0  )
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ అజొర్టెను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్!
X

బెంగళూరు: ప్రముఖ రిలయన్స్ రిటైల్ తన మొదటి ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ స్టోర్ అజొర్టెను గురువారం ప్రారంభించింది. ఇందులో మీడియం నుంచి ప్రీమియం బ్రాండ్లకు చెందిన అన్ని రకాల ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు లభిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

గత కొంతకాలంగా దేశంలో పెరుగుతున్న లగ్జరీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు రిలయన్స్ రిటైల్ ప్రయత్నిస్తోంది. బెంగళూరులో మొదటి స్టోర్ ప్రారంభమైన నేపథ్యంలో రాబోయే తొమ్మిది నెలల్లోగా 12 నగరాల్లో 30-40 స్టోర్లను, ఆ తర్వాత మూడేళ్లలో 200 స్టోర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.

దేశంలో వేగంగా పెరుగుతున్న మిలియనీర్స్, తర్వాతి జనరేషన్ వినియోగదారుల నుంచి అంతర్జాతీయ, దేశీయ ప్రీమియం బ్రాండ్ల కోసం డిమాండ్ అత్యధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ వినియోగదారుల కోసం అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ, దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, బ్యూటీ సహా అనేక బ్రాండ్లను ఒకేచోట అందించనున్నట్టు రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ అన్నారు.

మరో మూడేళ్ల కాలంలో రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వ్యాపారంలో 15 శాతం ఆదాయాన్ని అజొర్టె బ్రాండ్ నుంచే సాధిస్తుందని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అజొర్టె బ్రాండ్ కింద ప్రారంభమైన స్టోర్లలో స్మార్ట్ ట్రయల్ రూమ్‌లు, విశాలమైన నడవలు(కారిడార్లు), సెల్ఫ్-చెక్ఔట్ కియోస్క్‌లు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటాయని అజొర్టె వైస్-ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ రాకేష్ జల్లిపల్లి వెల్లడించారు.

Advertisement

Next Story