ఆల్టిగ్రీన్‌లో రూ. 50 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేసిన రిలయన్స్!

by Disha Desk |   ( Updated:2022-02-10 14:22:19.0  )
ఆల్టిగ్రీన్‌లో రూ. 50 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేసిన రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ కంపెనీ ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్‌లో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 50.16 కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ అనుబంధ కంపెనీ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎల్) కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో అల్టిగ్రీన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు గురువారం స్టాక్ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎంత ఈక్విటీ వాటా రిలయన్స్‌కు దక్కిందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ ఒప్పందానికి సంబంధించి లావాదేవీని ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేయనున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆల్టి గ్రీన్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ-వీలర్, త్రీ-వీలర్, కార్ల ద్వారా కమర్షియల్ రవాణా సదుపాయాలను అందిస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీ పూర్తిస్థాయిలో దేశీయంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాహనాలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కంపెనీ పేటెంట్ పోర్ట్‌ఫోలియోలో 26 గ్లోబల్ పేటెంట్‌లతో 60 దేశాల్లో విస్తరించి ఉంది. అలాగే, ఆల్టి గ్రీన్ సంస్థ ఎలక్ట్రిక్ మోటార్లు, జనరేటర్లు, వాహన కంట్రోల్, మోటార్ కంట్రోల్, ఈవీ ట్రాన్స్‌మిషన్, టెలిమాటిక్స్, ఐఓటీ, బ్యాటరీ నిర్వహణ విభాగాల్లో టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తోంది. 2013, ఫిబ్రవరిలో స్థాపించిన ఈ కంపెనీ 2020-21 లో రూ. 1.4 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.

Advertisement

Next Story