ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే: నిపుణులు

by S Gopi |
ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే: నిపుణులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఏప్రిల్ 3-5 తేదీల్లో ద్రవ్య పరపతి విధాన సమీక్షా(ఎంపీసీ) సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే భారత జీడీపీ వృద్ధి అంచనా దాదాపు 8 శాతం ఉన్న కారణంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించే లక్ష్యంలో భాగంగా ఆర్‌బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, యూఎస్, యూకే లాంటి ప్రధాన ఆర్థికవ్యవస్థ సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల ఆధారంగా ఎంపీసీ సభ్యులు నిర్ణయం తీసుకోవచ్చని, కాబట్టి వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 'ద్రవ్యోల్బణం ఇప్పటికీ 5 శాతం వద్ద ఉంది. ఆహార ద్రవ్యోల్బణం రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నందున మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉండవచ్చు. కాబట్టి ఎంపీసీ ఈసారి వడ్డీ రేటుతో పాటు విధాన వైఖరిని కూడా యథాతథ స్థితిని కొనసాగించడం మంచిద'ని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. 2023-24లో వృద్ధి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణంపై దృష్టి సారించాలని ఆర్‌బీఐ భావిస్తుంది. అయితే, జీడీపీ అంచనాల్లో సవరణలు ఉండవచ్చని ఆయన అన్నారు. కాగా, స్విట్జర్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించిన మొదటి ప్రధాన ఆర్థికవ్యవస్థగా నిలిచింది. అలాగే, మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జపాన్ సైతం ఎనిమిదేళ్లుగా తగ్గిస్తున్న వడ్డీ రేట్ల నిర్ణయానికి బ్రేక్ ఇచ్చింది. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 3-5 తేదీల్లో జరగనుంది. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయాలను వెల్లడిస్తారు. ఈ సమావేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎంపీసీ సమావేశం కానుంది.

Advertisement

Next Story