Real estate: ఆర్‌బీఐ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు

by Harish |
Real estate: ఆర్‌బీఐ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గురువారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గృహ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుందని, తాజా నిర్ణయం ద్వారా గృహ రుణ EMIలు ప్రస్తుతానికి స్థిరంగా ఉంటాయి. దీంతో వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొత్తగా గృహలు కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగి, రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వస్తాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో గృహలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. స్థిరమైన పాలసీ వడ్డీ రేటు గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్‌కు మద్దతునిస్తుంది. ఇది మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సహిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, పాలసీ రేట్లను మార్చకుండా ఉంచాలనే నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. కొనసాగుతున్న రెసిడెన్షియల్ విక్రయాలు మరింత పుంజుకుంటాయని, ఇది ఈ రంగం వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆర్‌బీఐ నిర్ణయం ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా గృహ మార్కెట్‌పై విశ్వాసాన్ని బలపరుస్తుంది. కొత్త వినియోగదారులను కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి, అలాగే, రియల్ ఎస్టేట్ అమ్మకాల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అక్టోబర్ పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ తన వైఖరిలో మార్పు రావచ్చు, డిసెంబరులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Advertisement

Next Story