సామాన్యులకు కేంద్రం ఊరట.. ఔషధాల ధరలు తగ్గింపు!

by Harish |   ( Updated:2023-04-03 13:33:05.0  )
సామాన్యులకు కేంద్రం ఊరట.. ఔషధాల ధరలు తగ్గింపు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణంతో ఖర్చుల భారాన్ని మోస్తున్న సామాన్యులకు కేంద్రం స్వల్ప ఊరట నిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మెజారిటీ అత్యవసర ఔషధాల సీలింగ్ ధరలను ప్రభుత్వం తగ్గించడంతో సుమారు 651 ముఖ్యమైన ఔషధాల ధరలు 6.73 శాతం తగ్గాయని ఎన్‌పీపీఏ తెలిపింది. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) ఈ మేరకు సోమవారం ప్రకటనను విడుదల చేసింది.

నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం) జాబితాలో ఉన్న 870 రకాల్లో 651 మందులకు కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దానివల్ల ధరలు 6.73 శాతం తగ్గడంతో వినియోగదారులకు ప్రయోజనాలు లభిస్తాయని ఎన్‌పీపీఏ వెల్లడించింది. ధరలు తగ్గిన వాటిలో సాధారణంగా ప్రజలు వాడే మందులు ఎక్కువగా ఉన్నాయి.

కాగా, దేశంలో ఎక్కువమంది వినియోగిస్తున్న సుమారు 870 రకాల ఔషధాల జాబితాను ఆరోగ్య శాఖ రూపొందించింది. వీటి ధరలను ఎన్‌పీపీఏ సమీక్షిస్తుంది. ప్రతి ఏటా టోకు ధరల సూచీని పరిగణలోకి తీసుకుని ఏప్రిల్ 1న వీటి ధరలను సవరిస్తారు. గతేడాది సవరణ అనంతరం ఔషధాల ధరలు 12.12 శాతం పెరిగాయి. అయితే, తాజాగా ఈ జాబితాలో 651 మందులకు కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దానివల్ల ఆయా ఔషధాల ధరలు దాదాపు 7 శాతం దిగొచ్చాయి.

Also Read..

ఏప్రిల్ 3 : నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే

Advertisement

Next Story